Telugu Gateway
Telangana

అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వస్తారా?

అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వస్తారా?
X

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అచ్చం ఇలాగే చెప్పారు. వందకు పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని..సర్వేలు అన్ని ఇదే మాట చూపుతున్నాయని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఫలితం ఏమైందో అందరూ చూశారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ముందుకు కూడా కెసిఆర్ అదే సీన్ రిపీట్ చేస్తున్నారు. సర్వేలు అన్ని బిఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని..అధికార కాంగ్రెస్ కు రెండు లోక్ సభ సీట్ల కంటే ఎక్కువ రావు అని సర్వేలు చెప్పాయని ప్రకటిస్తున్నారు. కానీ తెలంగాణాలో పరిస్థితి అంతా రివర్స్ లో ఉంది అనే విషయం కెసిఆర్ కూ కూడా తెలుసు. ప్రతి సర్వే కూడా ఫస్ట్ ప్లేస్ లో కాంగ్రెస్..సెకండ్ బీజేపీ, థర్డ్ ప్లేస్ లో బిఆర్ఎస్ ఉంటాయని చెపుతూ వస్తున్నాయి. ఈ మాటలు అన్ని చూస్తుంటే లోక్ సభ ఎన్నికల ముందు..తర్వాత కూడా పార్టీని కాపాడుకునేందుకు కెసిఆర్ నానా తంటాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. అత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నికల్లో కనీసం గౌరవ ప్రదమైన సీట్లు కూడా రాకపోతే కష్టమనే ఉద్దేశంతోనే కెసిఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 నుంచి 25 మంది టచ్ లో ఉన్నారు అని..వాళ్లకు తీసుకువస్తానని ఒక కీలక నేత అడిగితే ఇప్పుడు వద్దని చెప్పినట్లు కెసిఆర్ గురువారం నాడు పార్టీ నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు.

ఏ లాజిక్ ప్రకారం చూసినా అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోకి వెళ్ళటం జరగదు. నిజంగానే కెసిఆర్ చెప్పినట్లు కాంగ్రెస్ నుంచి 25 నుంచి 30 మంది వెళ్లినా కూడా స్పీకర్ వెంటనే వాళ్లపై అనర్హత వేటు వేస్తారు. తెలంగాణాలో ఎన్నికలు జరిగి ఇంకా నిండా ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ తరుణంలో అసలు ఇలాంటి రిస్క్ ఎవరు చేస్తారు. పైగా ప్రస్తుతం కాంగ్రెస్ గెలిచిన 64 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది సీఎం రేవంత్ రెడ్డి కి అనుకూలంగా ఉన్న వాళ్లే ఉన్నారు. పైగా అధికారంలో ఉంటే కెసిఆర్ ఎమ్మెల్యేలు, మంత్రులను ఎలా చూస్తారో వాళ్లకు తెలియంది కాదు. ఎంత లేదన్నా బిఆర్ఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ లో అన్ని రకాలుగా స్వేచ్ఛ ఎక్కువే అని చెప్పాలి. సో ఇది అంతా కూడా కెసిఆర్ లోక్ సభ ఎన్నికల ముందు పార్టీ నాయకులు...క్యాడర్ లో ఒకింత ధీమా ఇచ్చేందుకు చేసిన వ్యాఖ్యలుగానే కనిపిస్తున్నాయి అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే బిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావు లు కాంగ్రెస్ లో చేరారు.

ఇంకా మరింత మంది లైన్ లో ఉన్నట్లు కాంగ్రెస్ మంత్రులు చెపుతున్నారు. ఈ తరుణంలో కెసిఆర్ ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉంటుందో ఉండదో చూడాలి అంటూ పార్టీ మారాలి అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళను పునరాలోచనలో పడేలా చేయటమే అయన వ్యూహంగా ఉన్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతుంది. కెసిఆర్ చెపుతున్నట్లు నిజంగా కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బయటకు పోయే పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి ఇవన్నీ వదిలేసి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ తిరుగుతారా?. అయితే రేవంత్ రెడ్డి స్థానం సుస్థిరం కావాలన్నా...బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కోరుకున్నట్లు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలన్నా కూడా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలవటం అన్నది కీలకం అని చెప్పకతప్పదు. పైకి నవ్వుతున్నా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు చూస్తుంటే తనకు తాను పార్టీకి ఏమి కాదు అని ఏదో సర్ది చెప్పుకున్నట్లు ఉంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it