Telugu Gateway
Telangana

రాజకీయాల కోసమే అంబేద్కర్ పై కెసిఆర్ ప్రత్యేక ప్రేమ!

రాజకీయాల కోసమే అంబేద్కర్ పై కెసిఆర్ ప్రత్యేక ప్రేమ!
X

ఆరేళ్ళ తర్వాత...రాజకీయ కోణంలో ఆగమేఘాల మీద నిర్మాణం పూర్తి

బయటకు వచ్చి అంబేద్కర్ జయంతికి దండ వేయని కెసిఆర్

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అందరూ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ ఎదురుగా ఉన్న అయన విగ్రహం వద్ద కు వచ్చి దండ వేసి వెళ్లే వారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకటి..రెండు సార్లు ఆలా చేశారు. తర్వాత అయన తన అధికారిక కార్యాలయం ప్రగతి భవన్ నుంచి రెండు కిలోమీటర్లు కూడా ప్రయాణించి అంబేద్కర్ కు అయన జయంతి రోజు దండ వేయటానికి కూడా బయటకు రావటం మానేశారు. కార్యాలయంలోనే ఒక ఫోటో పెట్టి ఈ పని పూర్తి చేసి...మీడియా కు మాత్రం ఒక ప్రకటన విడుదల చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం నాడు ప్రారంభించనున్న 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహ నిర్మాణం తలపెట్టింది...ప్రకటించింది ఎప్పుడో తెలుసా...అయన తొలిసారి సీఎం అయిన రెండు సంవత్సరాలకు అంటే 2016 సంవత్సరంలో. ఈ విగ్రహనిర్మాణాన్ని ఏడాదిలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ ఇది పూర్తి చేయటానికి ప్రకటించిన నాటి నుంచి ఆరేళ్ళు దాటింది అంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. వాస్తవం చెప్పాలంటే ఈ నిర్మాణ పనులు గత ఏడాది కాలంలోనే ఊపు అందుకున్నాయి.

ఇప్పటికి పూర్తి అయ్యాయి. మరో ఆరు నెలల్లో తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి రాజకీయ లబ్ది పొందాలన్నది సీఎం కెసిఆర్ వ్యూహంగా చెపుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ కొత్త సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం...ప్రకటించిన ఆరేళ్ళ తర్వాత విగ్రహ పనులు పూర్తి చేయటం అంటే అన్నీ కూడా ఎన్నికల కోణంలోనే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంబేద్కర్ జయంతి రోజు బయటకు వచ్చి దండ కూడా వేయని సీఎం కెసిఆర్ ..ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పెడితే ప్రజలు పాత విషయాలు మర్చిపోతారా అన్న చర్చ తెలంగాణా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. సీఎం కెసిఆర్ ఇప్పుడు చేస్తున్న హంగామా ఎంత ఎన్నికల కోణంలోనే అని...తమకు కావాల్సిన పనులు అన్ని ఆగమేఘాల మీద చేయించుకుంటూ ఒక విగ్రహం ఏర్పాటుకు ఇంత సమయం తీసుకుని...ఇప్పుడు ఎన్నికల ముందు హంగామా చేయటం అంటే కెసిఆర్ ఎజెండా ను అర్ధం చేసుకోలేరా అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it