Telugu Gateway
Telangana

బిజెపిలో అంద‌రూ స‌త్య‌హ‌రిశ్చంద్రులేనా?

బిజెపిలో అంద‌రూ స‌త్య‌హ‌రిశ్చంద్రులేనా?
X

వాళ్ల ద‌గ్గ‌కు సీబీఐ, ఈడీలు వెళ్ళ‌వు

కేంద్రానికి కెసీఆర్ 24 గంట‌ల డెడ్ లైన్

ఢిల్లీ వేదిక‌గా తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ మోడీ స‌ర్కారుకు ఛాలెంజ్ విసిరారు. గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయ‌న సోమ‌వారం నాడు తెలంగాణా భ‌వ‌న్ లో నిర్వ‌హించిన ప్ర‌జా ప్ర‌తినిధుల నిర‌స‌న దీక్ష‌లో పాల్గొన్నారు. ధాన్యం సేక‌ర‌ణ విష‌యానికి సంబంధించి కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు . ఈ లోగా ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. మోడీ, పీయూష్ గోయ‌ల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల‌ని కోరుతున్నాన‌ని కేసీఆర్ పేర్కొన్నారు. పీయూష్ గోయెల్ ను పీయూష్ గోల్ మాల్ అంటూ విమ‌ర్శించారు. ఆయ‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వ‌చ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వ‌చ్చి ఆందోళ‌న చేయ‌డానికి కార‌ణ‌మెవ‌రు? న‌రేంద్ర మోదీ ఎవ‌రితోనైనా పెట్టుకో.. కానీ రైతుల వ‌ద్ద మాత్రం పెట్టుకోవ‌ద్దు. ప్ర‌భుత్వంలో ఎవ‌రూ శాశ్వతంగా ఉండ‌రు.

టీఆర్ఎస్ ఢిల్లీలో త‌ల‌పెట్టిన ఈ దీక్ష‌కు రైతు నేత రాకేశ్ తికాయ‌త్ సంఘీభావం తెలిపారు. దీక్ష‌లో పాల్గొని కేంద్రం తీరును త‌ప్పుప‌ట్టారు. ప్ర‌ధాని స్వ‌రాష్ట్రం గుజ‌రాత్‌లో విద్యుత్ కోసం రైతుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అదే స‌మ‌యంలో రాష్ట్ర బీజేపీ నేత‌ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ముఖ్య‌మంత్రిని జైలుకు పంపుతామ‌ని అంటున్నారు.. ద‌మ్ముంటే రండి అని కేసీఆర్ స‌వాల్ విసిరారు. కేంద్రం కార్పొరేట్ల‌కు కొమ్ము కాస్తూ.. రైతుల జీవితాల‌తో ఆట‌లాడుకుంటోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థ‌ల‌తో దాడులు చేస్తారు. బీజేపీలో అంద‌రూ స‌త్య‌హ‌రిశ్చంద్రులే ఉన్నారా? వాళ్ల ద‌గ్గ‌ర‌కు ఈడీ, సీబీఐ వెళ్ల‌దు.. ప్ర‌తి రాష్ట్రంలో ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను బెదిరిస్తున్నారు. సీఎంను జైలుకు పంపుతామ‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు అంటున్నారు. ద‌మ్ముంటే రావాల‌ని స‌వాల్ విసిరారు.

ఊరికే మొర‌గ‌డం స‌రికాద‌ని కేసీఆర్ అన్నారు. కేంద్రం పంట మార్పిడి చేయాల‌ని సూచించిన‌ట్లు తాము రైతుల‌కు చెప్పామ‌ని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగా రైతులు ధాన్యం పండించండి.. మేము కొంటామ‌ని కిష‌న్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా రైతుల‌ను రెచ్చ‌గొట్టాడు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల‌ని తాము ఢిల్లీలో ధ‌ర్నా చేస్తే.. పోటీగా బీజేపీ నేత‌లు హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేస్తున్నారు. అస‌లు వాళ్ల‌కు సిగ్గుండాల‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. ఏ ఉద్దేశంతో బీజేపీ నేతలు హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ నిస్సిగ్గుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. అంతిమ విజ‌యం సాధించేంత వ‌ర‌కు విశ్ర‌మించేది లేద‌ని కేసీఆర్ తేల్చిచెప్పారు.

Next Story
Share it