ఆదాయం..అప్పులు పెరిగినా..ఆగని భూముల అమ్మకం
ప్రభుత్వ ఖజానాకు 3319 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. బుద్వేల్ వేలం ద్వారా కూడా ఇంతే మొత్తంలో వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. కోకాపేట లో ఎకరం వంద కోట్ల రూపాయలకు అమ్ముడు పోవటం ప్రభుత్వానికి మంచిదే అయినా ఈ ధరలు రాబోయే రోజుల్లో మధ్యతరగతి ప్రజలను కూడా సొంత ఇంటి కలకు దూరం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది ఒకెత్తు అయితే 111 జీఓ రద్దుతో ఒకే సారి ఆ ప్రాంతంలో లక్ష ఎకరాల భూమి పైగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో ధరలు తగ్గుతాయని భావిస్తే సర్కారు వేలంలో ఒక బిట్ లో ఎకరా వంద కోట్ల రూపాయలు పైగా పలకటం వెనక ఏదైనా గూడుపుఠాణి ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే కొంత మంది హెచ్ఎండీఏ అధికారులే 111 జీఓ రద్దు తర్వాత రేట్లు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. కానీ వేలంలో మాత్రం పరిస్థితి తెలిసిన అధికారుల అంచనాలకు బిన్నంగా ధరలు రావటంపై మున్సిపల్ అధికారులు కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . దీంతో పాటు మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ఇలా వరసపెట్టి భూములు అమ్మటం అన్నది నైతికంగా ఎంత వరకు ఆమోదయోగ్యం అని ఒక ఐఏఎస్ విస్మయం వ్యక్తం చేశారు. అయితే కెసిఆర్ సర్కారు నైతికత వంటి అంశాలు పట్టించుకుంటుంది అని ఆశించటమే అత్యాశ అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ఆదాయం పెరిగినా...మరో వైపు విపరీతంగా అప్పులు చేస్తూ..భూములు అమ్ముతూ పాలనా సాగిస్తూ...మాదే సూపర్ మోడల్ అని చెప్పుకోవటం కెసిఆర్ , కెటిఆర్ లకే చెల్లింది.