Telugu Gateway
Telangana

కెసిఆర్ పార్టీ విస్తరణ...కవిత వ్యాపార విస్తరణ!

కెసిఆర్ పార్టీ విస్తరణ...కవిత వ్యాపార విస్తరణ!
X

కవిత లిక్కర్ కేసు తో ఇరకాటంలో కెసిఆర్!

ఒక రిమాండ్ రిపోర్ట్. ఇప్పుడు మరో చార్జిషీట్. ఈ రెండింటిలో తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటం రాజకీయంగా కీలకం కానుంది. ఇప్పటికే సిబిఐ ఇదే కేసు కు సంబంధించి కవిత స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న విషయం తెలిసిందే. ఇంత కాలం బిఆర్ఎస్ నేతలు రాజకీయ వేధింపుల్లో బాగంగానే కెసిఆర్ కుమార్తె కవిత పేరు తీసుకొస్తున్నారు అంటూ చెపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు లిక్కర్ స్కాం లో ప్రధాన నిందితుడుగా ఉన్న సమీర్‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన 181 పేజీల చార్జ్‌షీట్‌ లో కవిత పేరును ఏకంగా 28 సార్లు ప్రస్తావించారు. అదే సమయంలో కవిత ఢిల్లీ లో కూడా దీనికి సంబంధించి పలు సమావేశాల్లో పాల్గొన్నారని...హైదరాబాద్ లోని తన నివాసం లో..పేస్ టైం లో చర్చలు సాగించినట్లు వెల్లడించారు. తొలుత ఢిల్లీ కి చెందిన బీజేపీ నేతలు ఇదే అంశంపై విమర్శలు చేయగా ..కవిత కోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు కు సంబంధించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చివరివరకు ఇదే సీరియస్ నెస్ చూపిస్తుందా లేదా అన్న దానిపైనే ఈ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. సమీర్‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా మరో సారి కవితను విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక వైపు బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలనే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో...కవిత ఒక్క ఢిల్లీలోనే కాదు..పలు రాష్టాల్లో మద్యం వ్యాపారాన్ని విస్తరిద్దాం అని చెప్పినట్లు చార్జిషీట్ లో ప్రస్తావించటం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

లిక్కర్ స్కాం కోసం అందరూ కలిసి ఎలా చేశారు అన్న అంశంపై పూర్తి వివరాలు ఈ చార్జిషీట్లో ప్రస్తావించారు. అందులోని కొన్ని ముఖ్యంశాలు. కవితతో కలిసే సమీర్‌ మహేంద్రు మద్యం వ్యాపారం చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో.. కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, ఆడిటర్‌ బుచ్చిబాబు, పెర్నార్డ్‌ రికార్డ్‌కు చెందిన బినయ్‌ బాబు పలుమార్లు ఆప్‌ నేతలతో భేటీ అయ్యారని, హోల్‌సేల్‌, రిటైల్‌ ఉత్పత్తిదారులతో కుమ్మక్కై కార్టెల్‌(సిండికేట్‌)ను ఏర్పాటు చేశారని స్పష్టం చేసింది. కవిత, మాగుంట రాఘవ్‌, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్ గ్రూప్ . ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని దినేశ్‌ అరోరా వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. అరుణ్‌పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబులు సౌత్‌గ్రూ్‌ప తరఫున ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపింది. సమీర్‌ మహేంద్రుకు ఇండో స్పిరిట్స్‌ పేరిట ఎల్‌1 హోల్‌సేల్‌ లైసెన్సు లభించిందని, సౌత్‌గ్రూపునకు మొత్తం 7 జోన్లలో రిటైల్‌ లైసెన్సు లభించిందని వెల్లడించింది. సౌత్‌గ్రూ్‌ప ద్వారా విజయ్‌నాయర్‌కు రూ. 100 కోట్ల ముడుపులు అందాయని.. ఈ సిండికేట్‌ మొత్తం 32 రిటైల్‌ జోన్లలో తొమ్మిదింటిని దక్కించుకుందని స్పష్టం చేసింది. మద్యంపాలసీ ద్వారా తమకు చేకూరే లబ్ధి నుంచే ఈ 100 కోట్లను చెల్లించారని పేర్కొంది.

Next Story
Share it