Telugu Gateway
Telangana

కెసీఆర్ మామూలు సీఎం కారు

కెసీఆర్ మామూలు సీఎం కారు
X

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏడేళ్ళుగా తాము ఎంతో స‌హ‌నంతో ఉన్నామ‌ని..ఇప్పుడు చెప్పినా త‌మ పార్టీ వాళ్ళు విన‌టం లేద‌ని వ్యాఖ్యానించారు. మంత్రి మ‌ల్లారెడ్డి చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల అంశంపై స్పందిస్తూ కెటీఆర్ ఈ మాట‌ల‌న్నారు. ఆయ‌న శుక్ర‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ కెసీఆర్ మిగ‌తా రాష్ట్రాల సీఎంల్లా మామూలు సీఎం కాద‌ని..రాష్ట్రాన్ని పుట్టించిన వాడు..సాధించిన వాడు అని వ్యాఖ్యానించారు. అలాంటి కెసీఆర్ పై ఆయ‌న కాలి గోటికి స‌రిపోని వాళ్లు కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కొంత మంది జ‌ర్న‌లిస్టుల ముసుగు వేసుకుని కూడా సీఎంపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని..ఫ్రీడం ఆఫ్ స్పీచ్ పేరుతో ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌తి దానికి హ‌ద్దు ఉంటుంది అని..ఏడేళ్ళుగా తాము స‌హ‌నం పాటిస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. ఇంకా ఎంత కాలం వేచిచూస్తామ‌న్నారు. చ‌ర్య‌కు..ప్ర‌తి చ‌ర్య త‌ప్ప‌ద‌న్నారు.

మంత్రి మల్లారెడ్డికి జోష్, హుషారు ఎక్కువ ఉందని.. ఆవేశంలో ఏదో అన్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌పై ఎవడెవడో.. ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్ర‌జ‌లు సుభిక్షంగా ఉంటే ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చిన సమయంలో మిగతా రాష్ట్రాలకు నిధులు ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మొండి చేయి చూపించిందన్నారు. అయినా సిగ్గు లేకుండా ప్రజా సంగ్రామ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మోడీ రెండు కోట్ల ఉద్యోగాలిస్తాన‌ని చెప్పార‌న్నారు. అవి ఇవ్వ‌క‌పోగా ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు కూడా పోయేలా ఉన్నాయ‌న్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఫిట్ ఇండియా , సిట్ ఇండియా, స్కిల్ ఇండియా అయిపోయి.. బేచో ఇండియా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు. మౌలాలిలో 21ఎకరాల రైల్వే భూములను అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో 6లక్షల కోట్ల రూపాయ‌ల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని. అందులో మౌలాళి భూములు కూడా భాగమని చెప్పారు.

మహారాష్ట్రలో చేసినట్లు ఇక్కడ చేస్తే ఊరుకోమని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మల్లారెడ్డి వంటి పెద్దవారిని ఏదిపడితే అది మాట్లాడుతున్నారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరూ దొరక్క.. చంద్రబాబునాయుడు తొత్తు, బినామీ అయిన రేవంత్‌కు పదవి ఇచ్చారని ధ్వజమెత్తారు. రేవంత్ అంతలా మాట్లాడుతుంటే.. తాము ఇంకెంత మాట్లాడాలన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. సామెత గుర్తుకు తెచ్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. రాజ‌కీయాల్లో సంస్కారవంత‌మైన భాష ఉండాల‌ని తాము కూడా కోరుకుంటున్నామ‌ని..మీడియా వాళ్ళు అడ్డ‌గోలుగా మాట్లాడిన వారిని మ‌రి ఈ ప్ర‌శ్న‌లు అడుగుతున్నారా? అంటూ మంత్రి మీడియాపై ఎదురుదాడి చేశారు. మ‌హారాష్ట్ర‌లో సీఎంను ఒక్క మాట అంటే కేంద్ర మంత్రినే లోప‌లేశార‌ని..అక్క‌డ ప్ర‌భుత్వంలో కాంగ్రెస్ కూడా భాగ‌స్వామిగా ఉంద‌న్నారు. అలాగే ఇక్క‌డ కూడా చేయ‌మంటారా?. అలా చేస్తే మ‌ళ్లీ ప్ర‌జాస్వామ్యం ఏదేదో అంటూ మ‌ళ్ళీ మొద‌లుపెడ‌తార‌ని విమ‌ర్శించారు.

Next Story
Share it