Telugu Gateway
Telangana

ముందే పదవి వదులుకుని త్యాగం చేశారా?!

ముందే పదవి వదులుకుని త్యాగం చేశారా?!
X

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తీరు అటు రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తర్వాత కెసిఆర్ నోటి నుంచి ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం అనే మాట రాలేదు. ఇది ఒక్కటే కాదు...పదేళ్ల పాటు సీఎంగా ఛాన్స్ ఇచ్చిన ప్రజలకు కెసిఆర్ మాటమాత్రంగా అయినా కూడా ధన్యవాదాలు తెలిపే ప్రయత్నం చేయలేదు. బిఆర్ఎస్ తరపున ఈ పని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కెసిఆర్ తనయుడు కేటీఆర్ చేశారు. అయితే ఇది తండ్రి తరపున కొడుకు చెప్పటానికి ఫ్యామిలీ వ్యవహారం కాదు...రాష్ట్రానికి సంబదించిన విషయం. బిఆర్ఎస్ అధినేతగా ఉన్నది కెసిఆర్..కెటిఆర్ నిన్న మొన్నటివరకు అనధికారిక సీఎం గా వ్యవహరించారు అనే విమర్శలు ఉన్నా అధికారిక సీఎం కెసిఆరే కదా. అయినా సరే కెసిఆర్ మాత్రం ఇవేమి పట్టించుకోవటం లేదు. సోమవారం నాడు ఫార్మ్ హౌస్ లో తనను కలిసిన కొత్త ఎమ్మెల్యేలు, నాయకులతో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత దారుణంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగ బద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నా ప్రజా తీర్పుకు అనుగుణంగా హుందాగా వ్యవహరించి తప్పుకున్నామని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

పదేళ్లు సీఎం గా..నలభై ఏళ్ళపాటు రాజకీయాల్లో ఉన్న కెసిఆర్ అనాల్సిన మాటలేనా ఇవి అని అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటినుంచే పరిపాలన అంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వెళుతుంది. అత్యవసర పనులు చేయాలన్నా కూడా ఎన్నికల సమయంలో ఈసి అనుమతి తప్పనిసరి. అలాంటిది ఇప్పుడు కెసిఆర్ రాజ్యాంగ బద్దంగా జనవరి 16 వరకు తమ ప్రభుత్వానికి సమయం ఉంది అని చెప్పటం అంటే ఇది ప్రజలను పిచ్చోళ్లను చేయాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. అదే నిజం అయితే మరి డిసెంబర్ నాలుగున క్యాబినెట్ సమావేశం పెడతామని ఎందుకు పెట్టలేదో అని కొంత మంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ప్రజల తీర్పును హుందాగా అంగీకరించకుండా కెసిఆర్ ఇంకా తామేదో త్యాగం చేసినట్లు మాట్లాడటం చూసి అందరూ విస్తుపోతున్నారు అనే చెప్పాలి. కెసిఆర్ తాజా వ్యాఖ్యలు చూసిన తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అయన ఏమీ మారినట్లు లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it