ప్రశాంత్ కిషోర్ తో కలసి కెసీఆర్ కొత్త డ్రామాలు
'రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయం సీఎం కేసీఆర్ కు అర్ధమైంది. ఏం చేయాలో తెల్వక పీకే (ప్రశాంత్ కిషోర్) అనే వ్యూహకర్తను పెట్టుకుని 'ఫెడరల్ ఫ్రంట్' అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టిండు. బీజేపీపైనా, ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా విష ప్రచారం చేస్తుండు. ఎంత చేసినా టీఆర్ఎస్ గ్రాఫ్ పెరగట్లేదు. ప్రజలు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నరని సర్వేలు చెబుతుండటంతో తట్టుకోలేక బీజేపీ నేతలపై దాడులకు పురిగొల్పుతున్నడు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టలంటూ, జైళ్లంటూ భయపెడుతున్నడు. రాబోయే రోజుల్లో ఈ నిర్బంధాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అయినా బీజేపీ నేతలెవరూ భయపడాల్సిన పనిలేదు. జాతీయ నాయకత్వం మనకు పూర్తి అండగా ఉంది. ప్రజా సమస్యలపై ఉద్రుతంగా పోరాడండి. టీఆర్ఎస్ నేతల ఆరోపణలను, విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టండి '' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం నాడు బీజేపీ కరీంనగర్ జిల్లా పదాధికారుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలుసహా స్థానిక ప్రజా ప్రతినిధులెవరికీ పనులు చేయొద్దంటూ కేసీఆర్ అనధికార ఆదేశాలిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దుష్ట సాంప్రదాయం లేదని, ఇతర రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలకూతగిన గౌరవం ఉంటోందని అన్నారు.
చివరకు రాష్ట్ర ప్రథమ పౌరురాలు, గవర్నర్ తమిళ సై విషయంలోనూ కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ మేడారం వెళ్తే హెలికాప్టర్ సమకూర్చకుండా... మంత్రులు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలకకుండా చేస్తున్నారంటే... కేసీఆర్ ఎంతటి చిల్లర వ్యక్తో అర్ధం చేసుకోవాలన్నారు. ''కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నడు. రాష్ట్రం 'బంగారు తెలంగాణ' అయ్యిందట. దేశాన్ని కూడా 'బంగారు భారత్' చేస్తా''డట. నిజంగా తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యిందా?''అని ప్రశ్నించారు. ''గతంలో కేసీఆర్ కరీంనగర్ కొచ్చి నగరాన్ని లండన్ చేస్తానన్నడు. వరంగల్ ను వాషింగ్టన్ చేస్తానన్నడు. హైదరాబాద్ ను డల్లాస్ చేస్తానన్నడు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తానన్నడు. చేసిండా? ఇప్పుడు ఇగ ఇండియాను అమెరికా కన్న గొప్పగా చేస్తా.. బంగారు భారత్ చేస్తానని బయలు దేరిండు ఈ మాయ మాటల (పిట్టల) దొర!''అని మండిపడ్డారు. 'కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ ఎట్లున్నదో చూస్తున్నం కదా? ఎక్కడ చూసినా ఆత్మహత్యలే. ఎవరిని కదిలించినా కన్నీళ్లే... ఇత కీసీఆర్ చెప్పే బంగారు భారత్ ఎట్లుంటదో తెల్వాలంటే... తెలంగాణలో ఉన్న ఒక నిరుద్యోగిని, ఒక ఉద్యోగిని, ఒక రైతును, ఒక విద్యార్థిని, ఒక మహిళను, ఒక దళితుడిని అడిగితే చాలు! పూసగుచ్చినట్టు చెప్తరు.''అని ఎద్దేవా చేశారు.