Telugu Gateway
Telangana

దేశానికి ఇక కెసీఆరే దిక్కా?!

దేశానికి ఇక కెసీఆరే దిక్కా?!
X

తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ తొలి నినాదం స్వ‌రాష్ట్రం..స్వ‌ప‌రిపాల‌న‌. రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో కెసీఆర్ తో పాటు చాలా మంది ఉద్య‌మ‌కారులు..ఇత‌ర పార్టీలు క‌ల‌సి రావ‌టంతో తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింది. ఇప్పుడు సీఎం కెసీఆర్ రూటు మార్చారు. స్వ‌రాష్ట్రం..స్వ‌ప‌రిపాల‌న నుంచి కాలం క‌ల‌సి వ‌స్తే దేశ పాల‌న కూడా చేయాల‌ని ఆశ‌పడుతున్నారు. అందులో భాగంగానే జాతీయ పార్టీ పెట్ట‌క ముందే దేశ‌మంత‌టా రైతుల‌కు ఉచిత విద్యుత్ వంటి జాతీయ హామీలు ఇస్తున్నారు. దేశాన్ని ఇప్ప‌టి వ‌ర‌కూ పాలించిన కాంగ్రెస్, బిజెపిల‌కు అస‌లు పాల‌నే చేత‌కాద‌ని..తానొస్తే అద్భుతాలు చేస్తాన‌ని గ‌త కొంత కాలంగా కెసీఆర్ చెబుతూ వ‌స్తున్నారు. అస‌లు కాంగ్రెస్, బిజెపిల‌కు పాలన చేత‌నైతే ఇప్పుడు భార‌త్ ఇంకా చాలా ముందుకుపోయేదని చెబుతున్నారు. అమెరికా..చైనాల‌ను చూడాల‌ని సూచిస్తున్నారు. త‌మ‌కు అవ‌కాశం వ‌స్తే అగ్ర‌రాజ్యం అమెరికాను దాటేలా భార‌త్ ను డెవ‌ల‌ప్ చేస్తామ‌ని హామీ ఇస్తున్నారు. వాస్త‌వానికి ఎవ‌రైనా జాతీయ పార్టీ..ప్రాంతీయ పార్టీలు పెట్టుకోవ‌చ్చు. కానీ టీఆర్ఎస్ తెలంగాణ‌లో మాత్రం ఇత‌ర పార్టీల నేత‌ల‌పై ఢిల్లీ బానిస‌లు..గుజ‌రాత్ గులామ్ లు అని విమ‌ర్శించి ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్ళి..జాతీయ స్థాయిలో కెసీఆర్ ఏమ‌ని చెబుతారు. దేశంలోని ఏ పార్టీల‌కు..నేత‌ల‌కు పాల‌న రాదు..ఒక్క కెసీఆర్ మాత్ర‌మే దేశానికి దారి చూపించ‌గ‌ల‌ర‌నే నినాదంతో వెళ‌తారా?. ఓ వైపు తెలంగాణ రాష్ట్రంలోని హాస్ట‌ళ్ల‌లో పిల్ల‌లు పురుగుల అన్నం పెడుతున్నార‌ని ఆందోళ‌న‌లు చేస్తుంటే గ‌త కొన్ని నెల‌లుగా ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌టంలో కెసీఆర్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌వుతోంది.

తాజాగా కుని ఆప‌రేష‌న్లు విక‌టించి మ‌హిళలు ప్రాణాలు కోల్పోయిన సంఘ‌ట‌న‌లు మ‌న క‌ళ్ల ముందే ఉన్నాయి. మ‌రో వైపు స‌ర్కారు తెచ్చిన ధ‌ర‌ణితోటి ప్ర‌జ‌ల సొంత భూములు కూడా వారివి కాకుండా పోయి..అధికారుల చుట్టూ తిరుగుతూ నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. కెసీఆర్ గ‌తంలో రాష్ట్రంలోని ప‌ల ప్రాంతాలను ఇస్తాంబుల్, డ‌ల్లాస్ లుగా మారుస్తాన‌ని హామీలిచ్చారు. మ‌రి ఎనిమిదేళ్ళ‌లో ఈ దిశ‌గా ఎక్క‌డా అడుగులు ప‌డిన దాఖ‌లాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ స‌ర్కారు వైఫ‌ల్యాలు ఎన్నో ప్ర‌జ‌ల ముందు ఉన్నాయి. జాతీయ రాజ‌కీయాల‌కు సంబంధించి కెసీఆర్ ఇప్ప‌టికే ఎన్నోసార్లు మాట‌లు మార్చారు. మ‌ళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ క్యాంప్ లో ఆక‌స్మాత్తుగా ఈ హ‌డావుడి పెరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లాల ప్రెసిడెంట్లు అంద‌రూ వ‌చ్చి బంగారు భార‌త్ కెసీఆర్ తోనే సాధ్యం అని..దేశ ప్ర‌జ‌లు కెసీఆర్ నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్నార‌ని ప్ర‌క‌టించారు. ద‌స‌రాకు కెసీఆర్ కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న చేస్తార‌నే ప్ర‌చారం బ‌లంగా సాగుతోంది. అంతే కాదు ఏకంగా కెసీఆర్ కొత్త‌గా పెట్ట‌బోయే జాతీయ పార్టీతో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్, క‌ర్ణాట‌క‌, హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో పోటీకూడా చేస్తార‌ని చెబుతున్నారు. మ‌రి రాష్ట్ర ప్ర‌చారానికి వ‌చ్చే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బిజెపి నేత‌ల‌ను పొలిటిక‌ల్ టూరిస్టులు గా అభివ‌ర్ణించిన టీఆర్ఎస్ నేత‌లు ఆయా రాష్ట్రాల్లో ఏమ‌ని ప్ర‌చారం చేస్తారు. ప్రాంతీయ‌వాదంతో పుట్టిన పార్టీ జాతీయ‌వాదంతో ముందుకు సాగ‌గ‌ల‌దా..దీనికి ఆమోదం ల‌భిస్తుందా అన్న‌ది వేచిచూడాల్సిందే.

Next Story
Share it