పక్కా ప్లాన్ తో కాళేశ్వరం పై సిబిఐ విచారణ

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చి సోమవారం నాడు హైదరాబాద్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా ఆమె తన అన్న, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ టార్గెట్ గా పార్టీ పై తిరుగుబాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆమె ఇచ్చిన సంకేతాలు కూడా అలాగే ఉన్నాయి. కానీ సడన్ గా ఆమె సోమవారం నాడు హైదరాబాద్ లో మీడియా తో మాట్లాడుతూ బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు పాత్రే ఎక్కువ అన్నారు. ఆయన వల్లే కెసిఆర్ కు ఇప్పుడు అవినీతి మరక అంటింది అన్నారు. అందుకే రెండవ టర్మ్ లో హరీష్ రావు ను సాగునీటి శాఖ ఇవ్వకుండా పక్కనపెట్టారు అని కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు, మేఘా కృష్ణా రెడ్డి, సంతోష్ రావు ల వల్లే ఈ పేరు వచ్చింది అన్నారు. కెసిఆర్ కు ఎప్పుడూ తిండి, డబ్బు మీద వ్యామోహం లేదు అన్నారు...ఆయన ఆలోచన అంతా తెలంగాణ కోసం తప్ప మరొకటి కాదు అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు ల వెనక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి అని కవిత ఆరోపించారు. అందుకే ఆయన వాళ్ళను కాపాడుతున్నారు అని...అందరూ కలిసి ఒక్క కెసిఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అని ఆరోపించారు.
తాను ఇప్పుడు మాట్లాడితే తన వెనుక ఎవరో ఉన్నారంటారని.. కానీ, అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని..రాబోయే రోజుల్లో వాళ్ళ సంగతి తెలుస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు బాధ్యుణ్ణి చేస్తూ రేవంత్ ప్రభుత్వం మా నాన్నపై సీబీఐ విచారణ వేసింది. తన కడుపు మండిపోతోంది అన్నారు. హరీష్‌రావు, సంతోష్‌రావు వల్లే కేసీఆర్‌కు ఈ పరిస్థితి దాపురించింది...కేసీఆర్‌ను అడ్డుపెట్టుకుని హరీష్, సంతోష్ భారీగా ఆస్తులు కూడబెట్టారు. హరీష్‌రావు, సంతోష్‌రావుకు డబ్బు మాత్రమే కావాలి. మా నాన్న పరువు పోతే వాళ్ళకేమి నష్టం అంటూ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకున్నారు.
చివరకు కెసిఆర్ పై సిబిఐ విచారణ వరకు పరిస్థితి వచ్చాక తొక్కలో పార్టీ ఉంటే ఏంది ..లేకపోతే ఏంటి అన్నారు. ఆదివారం నాడు అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వయిరీ వేస్తున్నాం అని చెపితే అసలు పార్టీ లో రియాక్షన్ ఏది అన్నారు. అంతా ఒక ప్రీ ప్లాన్డ్ ఆలోచనలోనే రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించారు అన్నారు. రాష్ట్రంలో ఇన్ని ఏజెన్సీ లు ఉండగా సిబిఐ కి ఇస్తున్నారు అంటే ఇది అంతా ఒక పథకం ప్రకారం చేశారు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు కవిత. రేవంత్ రెడ్డి సర్కారుది ప్రచారం ఎక్కువ పని తక్కువ అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు లు తనపై ఎన్నో కుట్రలు చేశారు అని చెప్పారు. కెసిఆర్ బిడ్డగా ఈ రోజు తాను ఎంతో బాధ పడుతున్నట్లు తెలిపారు.



