కెసీఆర్, జగనూ కలిశారు
సుధీర్ఘ విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కెసీఆర్, జగన్ లు ఆదివారం నాడు హైదరాబాద్ లో కలుసుకున్నారు. వివాహ వేడుకల్లో పాల్గొనే సందర్భంగా ఈ భేటీ జరిగింది. కొద్ది రోజుల క్రితం ఇద్దరు సీఎంల మధ్య వివాదాలు..రాజకీయ విమర్శలు సాగిన విషయం తెలిసిందే. జగన్ ఏపీ సీఎం నుంచి అయినప్పటి నుంచి తెలంగాణ సీఎం కెసీఆర్ తో సత్సంబంధాలనే కొనసాగించారు.. కానీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మధ్యలో వివాదాలు చెలరేగాయి. తాజాగా కూడా తెలంగాణ, ఏపీ మంత్రులు పరస్పరం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పెళ్ళిలో అయినా ఇద్దరు సీఎంలు కలుసుకోవటం, ఇద్దరూ పక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించుకోవటం అందరిలో ఆసక్తి నింపింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డి పెళ్లి వేడుక వీరిద్దరి భేటీకి వేదిక అయింది. శంషాబాద్ కొత్తగూడలోని వీఎన్ఆర్ ఫామ్స్‌లో ఆదివారం స్నిగ్ధారెడ్డి వివాహం జరిగింది. ఏపీ సీఎం జగన్ వద్ద ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడైన రోహిత్ రెడ్డితో స్నిగ్ధారెడ్డి వివాహం జరిగింది.