Telugu Gateway
Telangana

ఉద్యమంలా భూములు అమ్ముతున్న కెసిఆర్ సర్కారు

ఉద్యమంలా భూములు అమ్ముతున్న కెసిఆర్ సర్కారు
X

ప్రభుత్వాలు భూములు అమ్మటం కొత్త కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఇది సాగుతోంది. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి అంటే ప్రస్తుతం కెసిఆర్ సర్కారు భూముల అమ్మకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. గత కొంత కాలంగా వరసపెట్టి భూములు అమ్మటమే పనిగా పెట్టుకుంది. నగరం నాలుగు దిక్కులా ఉన్న భూములను అటు ఎకరాలతో పాటు గజాల లెక్కన కూడా అమ్ముకుంటోంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో ఎందుకైనా మంచిది అన్న చందంగా సాగుతున్నాయి ఈ భూముల అమ్మకాలు. ఇది ఒక కారణం అయితే ఈ భూములను ఎడా పెడా అమ్మేసి ఆ డబ్బులనే ఎన్నికల ప్రేమతో ప్రకటించిన స్కీంలకు పంచేసి మరో సారి అధికారంలోకి వచ్చే అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనే ప్లాన్ కూడా ఉంది. ఎలా చూసుకున్నా లాభం కెసిఆర్ అండ్ కో కే అనే ప్రచారం బలంగా సాగుతోంది. ఎందుకంటే వేలం లో భూములు కొంటున్న వాటిలో కీలక కంపెనీలు ప్రభుత్వానికి చెందిన అస్మదీయులవే అనే చర్చ కూడా అధికార వర్గాల్లో ఉంది. ఒక్క హైదరాబాద్ లో కూడా కాకుండా పలు జిల్లాల్లో కూడా కెసిఆర్ సర్కారు భూములను అమ్మకానికి పెట్టింది.

ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వ భూముల వేలంపాట ఆపాలి...ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం మానుకోవాలి అంటూ ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కెటిఆర్ ప్లకార్డు పట్టుకుని మరీ ధర్నాలో కూర్చున్నారు. వెనక ఉన్న ఈ ఫోటో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కానీ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో కెసిఆర్ సర్కారు ప్రభుత్వ భూములను వేలం వేస్తోంది...అసలు సిసలైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు సాగుతోంది. కోకాపేటలో ఇప్పటికే రెండు విడతల అమ్మకాలు పూర్తి చేసింది. తాజాగా బుద్వేల్ వంతు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా మరిన్ని భూముల విక్రయాలు ఉండేలా ఉన్నాయని చెపుతున్నారు. అందుకే ఎక్కువ గ్యాప్ లేకుండా నోటిఫికెషన్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదు అని డిమాండ్ చేసిన కేటీఆర్ ఇప్పుడు ఎకరం వంద కోట్ల రూపాయల ధర పలికింది అని గొప్పగా చెప్పుకోవటమే కాకుండా..భూముల అమ్మకాన్ని కూడా ఒక ఘనతగా ప్రకటించుకుంటున్నారు. వెరైటీ అంటే ఇదేనేమో.

Next Story
Share it