Telugu Gateway
Telangana

కవిత కోసం ఇంత పెద్ద స్కెచ్ వేశారా!

కవిత  కోసం ఇంత పెద్ద స్కెచ్ వేశారా!
X

టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న విషయాలు ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. సీఎం గా ఉన్న సమయంలో కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ చేతులు జోడించి వేడుకుంటున్నట్లు మీడియా సమావేశంలో దేశంలోని న్యాయమూర్తులను కోరారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసింది అని...వాటిని తాము విజయవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు. దీనికి సంబదించిన ఆడియో , వీడియో క్లిప్స్ ను కెసిఆర్ అప్పట్లో సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల దగ్గర నుంచి మొదలు పెట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల హై కోర్ట్ న్యాయమూర్తుల కూడా పంపారు. ఇది కూడా అప్పటిలో దుమారం రేపింది. కానీ ట్యాపింగ్ లో ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు చూసి అందరూ అవాక్కు అవుతున్నారు అనే చెప్పాలి. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడేసేందుకు బీజేపీ కీలక నేత బి ఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసేలా కెసిఆర్ ప్లాన్ చేశారు...అది జరిగితే కేంద్రంలోని మోడీ సర్కారు తో బేరసారాలు ఆడి కవితను ఈ కేసు నుంచి బయట పడేసేలా చేయాలన్నది కెసిఆర్ ప్లాన్ గా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు.

బి ఎస్ సంతోష్ అరెస్ట్ ప్లాన్ ఫెయిల్ కావటంతో కెసిఆర్ పోలీస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అన్నారు. బీజేపీ కేవలం అప్పటి తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఒక్కరితో మాత్రమే టచ్ లో ఉంటే ఈ విషయం కూడా ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న కెసిఆర్ మిగిలిన ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దించి బీజేపీ ని అడ్డంగా బుక్ చేసేందుకు స్కెచ్ వేసినట్లు తెలిపారు. ఫార్మ్ హౌస్ లో ఎమ్మెల్యేల బేరసారాల విషయం వెలుగులోకి వచ్చిన సమయంలోనే అక్కడ ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు మాట్లాడిన తీరు చూసిన వాళ్లకు కూడా అప్పటిలోనే పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అందరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పుడు వివరాలు బయటకు వస్తున్నాయి. అంతే కాదు కొంతమంది వ్యాపారులను బెదిరించి ..బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళతో కోట్ల రూపాయల విలువైన ఎలెక్టోరల్ బాండ్స్ కూడా కొనుగోలు చేయించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అధికారంలో ఉండగా బిఆర్ఎస్ కు..కెసిఆర్ పూర్తిగా అండగా ఉన్న ఛానల్ యాజమాన్యం ఫోన్లు కూడా ట్యాప్ చేయటం ఇక్కడ కీలక విషయం గా చెప్పుకోవాలి.

సొంత పార్టీ నాయకులు, మీడియా అధినేతలు, జర్నలిస్టులు, కొంత మంది న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటే బిఆర్ఎస్ పాలనలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిణామాలు అన్ని చూసిన తర్వాత అసలు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను..ఆ పార్టీ కీలక నేతలను భవిష్యత్ లో ఎవరైనా నమ్ముతారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రతి ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత ట్యాపింగ్ జరుగుతుంది అని..కానీ ఇంత విచ్చలవిడిగా ప్రభుత్వంలో ట్యాపింగ్ కోసం కొంత మంది అధికారులను ఒక ప్రైవేట్ సైన్యంలా పెట్టి నడిపించటం మాత్రం ఒక్క బిఆర్ఎస్ సర్కారుకే సాధ్యం అయింది అని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలు ఇప్పటికే దెబ్బతిని ఉన్న బిఆర్ఎస్ ఇమేజ్ ను మరింత దారుణంగా దెబ్బతీస్తాయని చర్చ సాగుతోంది. ఇది బిఆర్ఎస్ ను రాజకీయంగా కూడా దారుణంగా దెబ్బతీసే అవకాశం ఉంది అని చెపుతున్నారు. తాజా పరిణామాలతో కెసిఆర్ ను ఇక అసలు ఎవరైనా నమ్ముతారా అన్న చర్చ కూడా తెరమీదకు వచ్చింది.

Next Story
Share it