Telugu Gateway
Telangana

కవిత విచారణ ఎఫెక్ట్: ప్రగతి భవన్ లో ఈ సారి ఉగాది వేడుక లేదు?!

కవిత విచారణ ఎఫెక్ట్: ప్రగతి భవన్ లో ఈ సారి ఉగాది వేడుక లేదు?!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి వర్గ సమావేశం అయినా ప్రగతి భవన్ లోనే...ఉగాది అయినా ప్రగతి భవన్ లోనే. ఒకప్పుడు కాబినెట్ సమావేశాలు సచివాలయంలో జరిగేవి...ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం రవీంద్ర భారతిలో జరిగేవి. ఇది ఎన్నో ఏళ్లుగా సాగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని లెక్కలు మారిపోయాయి. సీఎం కెసిఆర్ సెక్రటేరియట్ వైపు చూడటం ఎప్పుడో మానేశారు. మరి కొత్తది రెడీ అయిన తర్వాత కూడా సచివాలయానికి వస్తారా...లేక పాత పద్దతే కొనసాగిస్తారా అన్నది కాలం గడిస్తే కానీ తేలదు. కెసిఆర్ సీఎం అయిన తరవాత కూడా కొన్ని సార్లు ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం రవీంద్ర భారతి లో జరిగింది. కానీ తర్వాత అంత దూరం ఏమిపొతాంలే అనుకున్నారు ఏమో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రగతి భవన్ కే పరిమితం చేశారు. కానీ విచిత్రంగా ఈ సారి మాత్రం రవీంద్ర భారతి లో ఉగాది వేడుకలు సాగాయి. అయితే దీనికి కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కాలేదు. రాష్త్ర ప్రభుత్వం తరపున జరిగే వేడుకల్లో సీఎం పాల్గొనటం...పంచాంగ శ్రవణం ఆలకించటం ఆనవాయితీ అయితే ఈ సారి మంత్రులే రవీంద్రభారతి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పై ఆరోపణలు రావటం, ఆమె వరుసగా ఢిల్లీ లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే కెసిఆర్ ఈ సారి ప్రగతి భవన్ లో ఈ వేడుకలు నిర్వహించలేదు అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఈ టెన్షన్ లో అక్కడ వేడుకలు చేయటం ఇష్టం లేక మళ్ళీ పాత రవీంద్ర భారతి కి ఈ కార్యక్రమం మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఉగాది వేడుకల వేదిక మార్పు కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రవీంద్ర భారతి లో జరిగిన అధికారిక 2022 లో ప్రగతి భవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం కెసిఆర్ తో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి,పార్టీ నాయకుడు కేశవ రావు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, దయాకర్ రావు, శ్రీనివాస గౌడ్ పాల్గొన్న చిత్రాన్ని కూడా పైన చూడ వచ్చు. 2023 లో అంటే మార్చి 22 న రవీంద్ర భారతి లో జరిగిన ఉగాది వేడుకల్లో మాత్రం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లా రెడ్డి, శ్రీనివాస యాదవ్ తదితరులు ఉన్నారు. కవిత కేసు టెన్షన్ కారణంగానే ఈ సారి ఉగాది వేడుక వేదిక మారింది అని బిఆర్ఎస్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it