Telugu Gateway
Telangana

పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రభావం తప్పదా?

పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రభావం తప్పదా?
X

తెలంగాణ బీజేపీ కి అప్పుడూ....ఇప్పుడూ ఒకటే టెన్షన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కి నష్టం చేసిన అంశం...ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా తెర మీదకు రావటంతో ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు రావటం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. ఈ స్కాంలో కవిత అరెస్ట్ తప్పదు అంటూ తెలంగాణా బీజేపీ నేతలతో పాటు కొంత మంది ఢిల్లీ నాయకులు కూడా అప్పట్లో బహిరంగ ప్రకటనలు చేశారు. సీన్ కట్ చేస్తే జరిగింది ఏమీ లేదు. దీంతో బీజేపీ, బిఆర్ఎస్ లు ఒకటే అనే ప్రచారం బలంగా జరిగింది...ఇది రాజకీయంగా బీజేపీ కి, బిఆర్ఎస్ కు భారీగానే నష్టం చేసింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందు చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీ నేతలను ఒకింత ఆందోళనకు గురి చేస్తున్నాయనే చెప్పాలి. ఇప్పుడు కూడా గతంలో లాగానే హడావుడి తప్ప ఎలాంటి యాక్షన్స్ ఉండకపోతే ఇది మరో సారి బీజేపీ కొంప ముంచటం ఖాయం అనే భయం తెలంగాణ బీజేపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాములో విచారణకు హాజరు కావాల్సిందిగా సిబిఐ ఎమ్మెల్యే కవిత కు తాజాగా నోటీసు లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు లో సిబిఐ కవితను నిందితురాలిగా చేర్చటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నట్లు అయింది. 41 ఏ కింద కవిత కు నోటీసులు జారీ అయ్యాయి.

ఈడీ నోటీసుల విషయంలో కవిత సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించి ఈ విచారణకు దూరంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆమె 26 న సిబిఐ విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇప్పటికే పెద్ద ఎత్తున అరెస్ట్ లు జరిగిన విషయం తెలిసిందే. ఇదే కేసు లో ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని ఆప్ మంత్రులే చెపుతున్నారు. కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది అని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ స్కాం కేసు విషయంలో కేంద్రం, కేంద్ర ఏజెన్సీలు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించటం ఖాయంగా కనిపిస్తోంది. కవిత విషయంలో జరిగే పరిణామాలు మాత్రం ఖచ్చితంగా తమపై ఎంతో కొంత ప్రభావం చూపించటం ఖాయం అనే భయం తెలంగాణ బీజేపీ నేతల్లో ఉంది. లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ, బిఆర్ఎస్ లు కలిసి పోయే అవకాశం ఉంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ విషయాన్నీ రెండు పార్టీ లు ఖండిస్తున్నా కూడా ఈ విషయంలో తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు లిక్కర్ స్కాములో జరిగే పరిణామాలు కూడా రాజకీయాలపై ప్రభావం చూపించటం ఖాయం అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it