కర్ణాటక ఫలితాలతో బిఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి!
కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు తెలంగాణాలో అధికార బిఆర్ఎస్ ని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయా?. తెలంగాణ పొరుగునే ఉండే దక్షిణాది రాష్ట్రం కాంగ్రెస్ చేతికి చిక్కటం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.గత కొంతకాలంగా వరస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ కు కచ్చితంగా ఇది జోష్ తెచ్చే అంశమే. కచ్చితంగా కర్ణాటక ఫలితాల ప్రభావం ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణ రాజకీయాలపై కూడా ఎంతో కొంత ఉండటం ఖాయం అనే అభిప్రాయం వివిధ వర్గాల్లో ఉంది. ఎన్నికల నాటికి కర్ణాటక నుంచి ఎంతోకొంత ఆర్థిక అందండలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వరసపెట్టి డిక్లరేషన్స్ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. తొలుత వరంగల్ లో రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్..తాజాగా ప్రియాంక గాంధీ సమక్షంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే మరికొన్ని డిక్లరేషన్స్ తో కూడా ముందుకు రానుంది. కర్ణాటక ఫలితాలతో తెలంగాణ బీజేపీ లోకి ఇప్పటికిప్పుడు కొత్త చేరికలు ఉండవు. కాంగ్రెస్ నేతలు కూడా పక్క చూపులు చూసే ఛాన్స్ లు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటిఆర్ స్పందించిన తీరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ఫలితాలపై అయన ట్వీట్ చేశారు. ఆ సారాంశం ఇలా ఉంది. ‘ది కేరళ స్టోరీ’ కర్ణాటక ప్రజలపై ప్రభావం చూపించటంలో పూర్తిగా విఫలం అయింది.అదేవిధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవు’’ విభజన రాజకీయాలను తిప్పికొట్టిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. మరింత గొప్ప భారత్ కోసం పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన విషయంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఆరోగ్యకరంగా పోటీపడనిద్దాం. కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు ’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అయన తన ట్వీట్ లో బిఆర్ఎస్ మిత్రపక్షం జెడిఎస్ అంశాన్ని పూర్తిగా వదిలేసారు. ఫలితాలు పూర్తిగా వెల్లడి కాకముందే ఆ ప్రభావం తెలంగాణ పై ఉండదు అంటూ ట్వీట్ చేశారు అంటే అయన ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్ధం అవుతుంది అనే చర్చ సాగుతోంది. ఈ ట్వీట్ ద్వారా కెటిఆర్ తనకు తాను దైర్యం చెప్పుకున్నట్లు ఉంది అని...ఇంత స్పీడ్ గా స్పందించటం తో ప్రజలకు అనుమానాలు వస్తాయని ఒక నేత అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ విషయంపై స్పందించక ముందే కెటిఆర్ దీనిపై ట్వీట్ చేయటంతో పరిస్థితి ఎలా ఉందో..వాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్ధం అవుతుంది అని చెపుతున్నారు. కెటిఆర్ ట్వీట్ చూసి ఇది ఏదో కెటిఆర్ సెల్ఫ్ సర్టిఫికేషన్ జారీ చేసుకున్నట్లు ఉంది అని కొంత మంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమిపై తెలంగాణాలో అధికార బిఆర్ఎస్ ఎంత సంతోషపడుతుందో తెలియదు కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంతటి ఘన విజయం సాధించటం మాత్రం ఆ పార్టీ కి ఏ మాత్రం మింగుడుపడని విషయమే. ఎందుకంటే తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ల మద్యే ఉంటుంది అనేది తెలిసిన విషయమే. ఒక రకంగా కర్ణాటక ఫలితాలు బిఆర్ఎస్ కు షాక్ వంటివే అని చెప్పాలి. కర్ణాటక ఫలితాలు ఇచ్చిన జోష్ తో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ గా కాంగ్రెస్ ఈ సారి మరింత దూకుడు పెంచటం ఖాయంగా కనిపిస్తోంది. కర్ణాటకలో అయితే ఎలా ప్రచారం చేసారో అలాగే తెలంగాణ పై కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక తో పాటు కీలక నేతలు ఫోకస్ పెడతారు. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో గెలుపునకు తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాల్సి ఉంటుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.