Telugu Gateway
Telangana

కాంగ్రెస్ సర్కారు కు ఇదే పెద్ద సవాల్!

కాంగ్రెస్ సర్కారు కు ఇదే పెద్ద సవాల్!
X

తెలంగాణ లోని రేవంత్ రెడ్డి సర్కారు ఇంకా కాళేశ్వరం స్కాం లో విచారణకు ఆదేశించనే లేదు..అప్పుడే ఈ స్కాం ను ఎంత వీలు అయితే అంత మేర తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నాలు గట్టిగా మొదలయ్యాయి. దీని కోసం రెండు వర్గాల వారిని కాపాడేందుకు ఒక ప్రముఖ పత్రికాధినేత రంగంలోకి దిగారు అని కాంగ్రెస్ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు..మరో మెగా కాంట్రాక్టర్ కు కావాల్సిన ఈ వ్యక్తే ఇప్పుడు ఈ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు అని చెపుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పాటు, మంత్రుల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒక వైపు పత్రికాధిపతి...మరో వైపు ఎలాగూ ప్రభుత్వంలో ఉన్న కొంత మంది కోవర్టులు కూడా ఈ దిశగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. అందులో భాగంగానే మేడిగడ్డ పనులు చేసిన లార్సన్ అండ్ టూబ్రో ( ఎల్ అండ్ టి) పైనే ఫోకస్ పెడుతున్నారు కానీ...ఈ ప్రాజెక్ట్ లో వివిధ పనులు చేసి...వేల కోట్ల రూపాయలు మేర అనుచిత లబ్ది పొందిన కంపెనీ పై ఈగ కూడా వాలనివ్వటం లేదు అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎల్ అండ్ టి పై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ మరి ఇదే ప్రాజెక్ట్ లో దోచుకున్న మిగిలిన కంపెనీల సంగతి ఏంటి?. ఒక వైపు మంత్రులు...కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ సాక్షిగా...బయట కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే అదిపెద్ద కుంభకోణంగా చెపుతూ వస్తున్నారు. మరో వైపు దీనిపై విచారణకు ఆదేశించే విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. హై కోర్ట్ కాళేశ్వరం స్కాం పై విచారణకు సిట్టింగ్ జడ్జ్ ను కేటాయించటం సాధ్యం కాదు అని చెప్పటం తో రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.

మరో వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బీజేపీ నేతలు అందరూ కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తుంటే...సిబిఐ కి ఇస్తే అది ఇక పూర్తిగా బీజేపీ చేతిలోకి పోయినట్లే అని...ఇద్దరూ కలిసి సెటిల్ చేసుకుంటారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పలు మార్లు కౌంటర్లు ఇచ్చారు. లక్షన్నర కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ పేకమేడలా కూలే పరిస్థితి వస్తుంటే ..ఇవన్నీ పక్కన పెట్టి కెసిఆర్ ఫ్యామిలీ ని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేయకూడదు అని...ప్రతీకారం కోసం చూడకూడదు అంటూ బహిరంగంగా చెపుతున్నారు అంటే ఇంత కంటే దారుణం మరొకటి ఉండదు అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. మరి ఇన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను అధిగమించి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కాళేశ్వరం స్కాం విషయంలో ముందుకు వెళ్లగలుగుతుందా...ఇందులో వేల కోట్ల రూపాయలు దోచుకున్న వారిని జైలు కు పంపగలుతుందా?. ఇదే ఇప్పుడు ఆయనకు పెద్ద సవాల్ గా కూడా మారబోతుంది. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోకతప్పదు. అయితే కాళేశ్వరం విచారణ ముందుకు సాగకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నారు...అవసరం అయితే రేవంత్ రెడ్డి సర్కారు కు ఇబ్బందులు సృష్టించడానికి కూడా వెనకాడే పరిస్థితి ఉండదు అనే సంకేతాలు పంపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it