Telugu Gateway
Telangana

కాళేశ్వరం పై కెసిఆర్ నోరు విప్పరా?

కాళేశ్వరం పై కెసిఆర్ నోరు విప్పరా?
X


కాళేశ్వరం కట్టిన ఐదు నెలలకు బయటపడ్డ భారీ లోపాలు!

అయినా స్పందించని అప్పటి సర్కారు

నిన్న మొన్నటి వరకు అద్భుతం అని ప్రజలను నమ్మించే ప్రయత్నం

తెలంగాణాలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత గత ప్రభుత్వ అక్రమాలు ఒక్క్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే గత బిఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంటే దారుణంగా..తమ ఇష్టానుసారం నడిపింది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. అయితే అప్పుడు నోరు తెరిచి ఏది తప్పు...ఏది కరెక్టో చెప్పాల్సిన పెద్ద పెద్ద ఐఏఎస్ అధికారులు కూడా ఎస్ బాస్ అంటూ అప్పటి ప్రభుత్వం ఏమి చెపితే అది చేసుకుంటూ పోయారు తప్ప రూల్స్ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు అని కొంత మంది అధికారులు చెపుతున్నారు. గత ప్రభుత్వం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఎంతో గొప్పగా కట్టమని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ డొల్లతనం విషయాలను నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి ఇప్పుడు బయటిపెట్టినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఇది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పాలి. దేశంలోనే గొప్ప ప్రాజెక్టుగా ప్రచారం చేసిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్ఐఎస్ ) కు సంబంధించి ఇప్పుడు కొత్తగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ఐదు నెలలకే అంటే 2019 నవంబర్ లోనే ఇందులోని లోపాలు బయటపడ్డాయి. ఈ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేసింది 2019 జూన్ లోనే. దీంతో మేడిగడ్డలో పియర్స్ కుంగుబాటు అప్పటికప్పుడు తలెత్తింది కాదు అని తేలిపోయింది. ఇదే అంశంపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి వెంటనే ఇరిగేషన్ శాఖకు సమాచారం కూడా ఇచ్చినట్లు సమాచారం. 2019 లో వర్షాకాలం ముగిసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ కింది భాగంలో ఉండే సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకువెళ్లినా కూడా లోపాలు సవరించేందుకు వీలుగా ఎలాంటి చర్యలు చెప్పుటలేదు అని ఎల్ అండ్ టి స్పష్టం వెల్లడించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇదే తరహా సమస్యలు సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ ల్లో కూడా వచ్చినట్లు గుర్తించారు. నీటిని విడుదల చేసే సమయంలో ఉండే తీవ్రతకు కాంక్రీట్ సిమెంట్ బ్లాక్స్ కదిలాయి. ప్రాజెక్ట్ భద్రత దృష్ట్యా ఈ డ్యామేజిలను తీవ్రంగా తీసుకుని స్టడీ చేయటంతో పాటు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్మాణ సంస్థ కోరింది.

మరో కీలక విషయం ఏమిటి అంటే పూణే కేంద్రంగా పని చేసే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కూడా 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ఈ మూడు బ్యారేజీల్లో కూడా సమస్యలు ఉన్నట్లు నిర్దారించింది. అయినా సరే గత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అధికారులను కూడా ఇప్పుడు షాక్ కు గురిచేస్తోంది. అధిక వడ్డీకి వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కట్టిన ప్రాజెక్ట్ విషయంలో గత కెసిఆర్ సర్కారు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఐటి, పరిశ్రమల శాఖలో ఎప్పటి నుంచో పాతుకు పోయిన ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ సర్కారు కొత్తగా కట్టిన సచివాలయానికి సంబంధించి దగ్గర దగ్గర మూడు వందల కోట్ల రూపాయల విలువైన ఐటి మౌలిక వసతులు, నెట్ వర్క్ సెక్యూరిటీ ఎక్విప్ మెంట్, స్విచ్ ల కొనుగోలు విషయంలో నిబంధలు పాటించలేదు అనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఇందులో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏమి చెపితే అయన అదే చేసుకుంటూ పోయారు అని ..నియమ నిబంధనలు తుంగలో తొక్కారు అని చెపుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తే గత ప్రభుత్వ అక్రమాలు తేల్చటానికి ఎంత కాలం పడుతుందో చెప్పటం కష్టం అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో గత కెసిఆర్ సర్కారు ఘనకార్యాలు ఇంకెన్ని బయటకు వస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it