ఇప్పటికే ఖాళీ అయిన జలాశయాలు !
మేడిగడ్డలో నీళ్లు నింపకపోతే 36 లక్షల ఎకరాలకు నీళ్లు కష్టమే
ఇప్పటికే ఖాళీ అయిన జలాశయాలు !
ఖజానాపై కొత్తగా పడే భారం ఎంత...అది ఎప్పటికి మళ్ళీ దారికొస్తుంది?
సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో
ఒక్క తప్పు. ఎన్ని తిప్పలో. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు దేనికీ పనికి రాకుండా పోతుందా?. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఈ ప్రాజెక్ట్ మరింత నష్టాల్లోకి నెట్టనుందా?. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డీఎస్ ఏ) నివేదిక ప్రకారం చూస్తే ఇప్పుడు కాళేశ్వరం ఆయకట్టు మొత్తం ప్రమాదంలో పడబోతున్నట్లు అధికారులు చెపుతున్నారు. రబీ తో పాటు ఖరీఫ్ కు కూడా కాళేశ్వరం ఆయకట్టు కింద నీళ్లు రావటం కష్టమే అన్నది వాళ్ళు చెపుతున్న మాట. ఇప్పటికే అక్కడక్కడ జలాశయాల్లో నింపి ఉన్న నీళ్లు జనవరి-ఫిబ్రవరి వరకు వస్తాయని తర్వాత నీళ్లు కష్టమే అని చెపుతున్నారు. కెసిఆర్ ప్రభుత్వ నిర్మాణ, నిర్వహణ లోపం కారణంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా చెప్పుకున్న కాళేశ్వరం ఇప్పుడు నవ్వుల పాలు అవుతోంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు మేడిగడ్డలో నీళ్లు నింపితే మొత్తం డ్యామ్ ప్రమాదంలో పడటమే కాకుండా...భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని పేర్కొంది. దీంతో కాళేశ్వరం ఆయకట్టు మొత్తం ప్రమాదంలో పడినట్లు అవుతుంది అని నిపుణులు చెపుతున్న మాట. ఈ పరిస్థితి ఇలా ఉంటే సీపేజ్ కారణంగా అన్నారం సరస్వతి బ్యారేజ్ లో నీటిని కూడా వదలటం ప్రారంభించారు. అటు అన్నారం తో పాటు సుందిళ్ల లో కూడా మేడిగడ్డ లో ఉన్న పరిస్థితే ఉండే అవకాశం ఉంది అని...దీనికి ప్రధాన కారణం మేడిగడ్డ తో పాటు ఈ బ్యారేజీలు అన్నీ కూడా ఒకే డిజైన్ తో నిర్మించినట్లు డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ తెలిపింది. ఈ అథారిటీ నివేదికలో మేడిగడ్డ బ్యారేజ్ ను మొత్తం మళ్ళీ కట్టాల్సి రావచ్చు అంటూ చేసిన పరిశీలనా వ్యాఖ్యలు మాత్రం పెద్ద సంచలనంగా మారాయని చెప్పొచ్చు.
ఇప్పుడు ఉన్న బ్యారేజ్ అయితే ఏ మాత్రం పనికి రాదు అని తేల్చి చెప్పింది. దీంతో కాళేశ్వరం కింద ఉన్న 18 లక్షల ఆయకట్టు, మరో 18 లక్షల స్థిరీకరణ ఆయకట్టు కలిపి మొత్తం 36 లక్షల ఆయకట్టు పరిస్థితి మొదటికి వచ్చేలా ఉంది అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మేడిగడ్డలో రిపేర్లు కూడా సాధ్యం అయ్యే ఛాన్స్ లేదు అని నివేదికలో ప్రస్తావించారు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ సాధారణ స్థితికి రావటానికి ఎంత సమయం పడుతుంది...దీనికి మళ్ళీ ఎంత వ్యయం అవుతుంది వంటి అంశాలు ఎప్పటికి తేలతాయో చెప్పటం ఇప్పటికిప్పుడు చెప్పటం కష్టమే అని అధికారులు చెపుతున్నారు. మేడిగడ్డ ఎపిసోడ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగింది అనే ఆరోపణలకు ఊతం ఇచ్చేదిలా ఉంది అని...ఇప్పుడు పిల్లర్లు కుంగటం...ఇతర బ్యారేజీల దగ్గర సీపేజ్ లు మొత్తం ప్రాజెక్ట్ పై ఎన్నో అనుమానాలు తలెత్తడానికి కారణం అయింది. ఒక వైపు మేడిగడ్డలో పిల్లర్లు కుంగిన విషయం, సీపేజ్ లు కళ్ల ముందు కనబడుతున్న కూడా మంత్రి కేటీఆర్ రాజకీయ దురుద్దేశముతో డ్యామ్ సేఫ్టీ నివేదిక ఉంది అని ఆరోపిస్తున్నారు. డిజైన్లు తప్పు అయితే కేంద్రం అనుమతులు ఎలా ఇచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అటు కేంద్రం, ఇటు రాష్త్రం కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రజలతో ఆడుకుంటున్నాయనే విషయం స్పష్టం అవుతుంది అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.