Telugu Gateway
Telangana

కొత్త బేరాలకు తెరలేపారా!

కొత్త బేరాలకు తెరలేపారా!
X

కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తప్పు చేసింది ఎవరు?. గతంలో అధికారంలో ఉన్న నేతలా?. లేక నిర్మాణ సంస్థలా. అధికారికంగా 2019 జూన్ లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. ప్రాజెక్ట్ ప్రారంభం అయి నిండా ఐదేళ్లు కూడా పూర్తి కాకముందే మేడిగడ్డ బ్యారేజ్ లో భారీ లోపాలు వెలుగుచూశాయి. ఇది తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచింది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఏకంగా 4000 కోట్ల రూపాయల పైగా అంచనా వ్యయంతో దెబ్బతిన్న బ్యారేజ్ ల పునరుద్దరణకు రంగం సిద్ధం చేస్తోంది. దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయల వ్యయం చేసి కట్టిన ప్రాజెక్ట్ పునరుద్ధరణ జరగాల్సిందే...రైతులకు నీళ్లు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందే. అయితే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎవరి తప్పులకు...ఎవరు మూల్యం చెల్లించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దల తీరు చూస్తుంటే గత స్కాం లో వాటాలు తీసుకుని..ఇప్పుడు మళ్ళీ కొత్త స్కాం చేయటానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

లేక పోతే ఇంత పెద్ద భారీ స్కాం లో ఎవరిపైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్న అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. అన్నిటి కంటే మరో ముఖ్యమైన విషయం కాళేశ్వరం లో స్కాం జరిగింది అని తెలిసి...డిజైన్ల ఆమోదంతో పాటు ఇతర విషయంలో ఘోరమైన వైఫల్యాలు ఉన్నాయని ప్రకటించి అందరిని అలా వదిలేయటం వెనక తెర వెనక జరిగిన డీల్సే కారణం అనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతోంది. అన్ని విషయాలు వదిలేసి మరో నాలుగు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో అయినా కాళేశ్వరం కష్టాలకు శాశ్వత ముగింపు పడుతుందా అంటే చెప్పటం కష్టమే అనే అభిప్రాయం కూడా ఇంజనీరింగ్ నిపుణుల నుంచి వస్తోంది. ఇప్పటికే బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పెట్టిన ఖర్చు చాలా చాలా ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నాయి. లక్ష కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ లో లోపాలు ఐదేళ్లు కూడా కాకుండా బయటపడితే అటు నిర్మాణ సంస్థలపై కానీ...ప్రజా ధనం ఇంత భారీ మొత్తంలో దుర్వినియోగం అవటానికి కారణం అయిన రాజకీయ నేతలపై కానీ...ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు లేవు.

కానీ రేవంత్ రెడ్డి సర్కారు వీటి రిపేర్లకు వేల కోట్ల రూపాయలు వెచ్చింటానికి సిద్ధం అవుతోంది. దీంతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విచిత్రం ఏమిటి అంటే గతంలో ఈ బ్యారేజ్ లు కట్టిన సంస్థలకే నామినేషన్ పద్ధతిపై పనులు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పునరుద్ధరణ పనుల విషయంలో కూడా దోపిడీకి కొంత మంది స్కెచ్ వేస్తున్నారు అనే ఆరోపణలు అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటాం అని...కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించిన నేతలు ఇప్పుడు అంతా సెటిల్ చేసుకుని మళ్ళీ కొత్త బేరాలకు తెరలేపినట్లు కనిపిస్తోంది అనే ఆరోపణలు ఆ శాఖ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.

Next Story
Share it