కాళేశ్వరం కహానీలు ఎన్నో!
తెలంగాణ సాగునీటి శాఖ. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గరే ఉంది. అంటే ఆ శాఖ వ్యవహారాలు అన్నీ ఆయనే చూస్తున్నట్లు లెక్క. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే సమయంలో ఒక ఇంజనీర్ గా ప్రాజెక్ట్ ల రీ డిజైన్ తానే చేసినట్లు గొప్పగా చెప్పుకున్నారు కూడా. ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా ఆయనే తీసుకున్నారు. కానీ అందులో లోపాలు బయటపడుతున్న ప్రతిసారి కుట్ర కోణాలను తెరమీదకు తీసుకువస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక గుదిబండ అవుతుంది అని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. దీనికి అయ్యే విద్యుత్ వ్యయమే ఒక రేంజ్ లో ఉండనుంది. కాసేపు ఆ సంగతి పక్కన పెడితే ప్రాజెక్ట్ కట్టి నిండా ఐదేళ్లు కూడా కాకముందే వరసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం బిఆర్ఎస్ సర్కారు..సీఎం కెసిఆర్ పై అనుమానాలను మరింత పెంచుతున్నాయి. విపక్షాలు చేసిన అవినీతి ఆరోపణలకు ఊతం ఇచ్చేలా జరుగుతున్న పరిణామాలు అధికార బిఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయనే చెప్పొచ్చు. నవంబర్ 30 న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభావం తమను దెబ్బ తీస్తుందేమో అనే భయం బిఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఎన్నికల ముందు బయటపడ్డ మేడిగడ్డ బండారం తమ కొంప ముంచే అవకాశం లేకపోలేదు అనే భయం బిఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. కొద్ది నెలల క్రితం వరదలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు మునిగిపోతే స్వయంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ క్లౌడ్ బరస్ట్..విదేశీ కుట్ర అంటూ దీనిపై అనుమానాలు ఉన్నాయి అని మాట్లాడారు. అంతే తర్వాత ఆ విషయం పక్కనపడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అలాగే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వార్తలు తెలంగాణాలో దుమారమే రేపాయి. తాజా ఎపిసోడ్ అత్యంత వివాదాస్పద కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరిన్ని అనుమానాలు పెంచేలా చేశాయి. అయితే ఇటీవల చోటు చేసుకున్న మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై అధికార బిఆర్ఎస్ నేతలు స్పందించలేదు కానీ...వెంటనే దీని వెనక కుట్ర కోణం ఉంది అనే అనుమానాలను తెరమీదకు తెచ్చారు.
అలాగే ఒక ఇంజనీర్ తో ఫిర్యాదు కూడా చేయించారు. అంటే అప్పుడు మోటార్లు మునిగితే కెసిఆర్ కుట్ర అన్నారు...ఇప్పుడు బ్యారేజ్ పిల్లర్లు కుంగితే కూడా కుట్ర అంటూ అసలు వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. అన్నిటి కంటే విచిత్రం ఏమిటి అంటే పునాదిలో ఇసుక కోత వల్లే మేడిగడ్డ లో ఇరవైవ పిల్లర్ కుంగుబాటుకు గురిఅయింది అని ఈఎన్ సి మురళీధర రావు చెప్పటం ఇంజనీరింగ్ వర్గాలను కూడా షాక్ కు గురి చేస్తున్నాయి. భారీ భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ప్రాజెక్టుల దగ్గర బ్రిడ్జి లు కట్టేది నీళ్లలోనే. మరి ఎక్కడా కదలని ఇసుక ఒక్క మేడిగడ్డలో మాత్రమే ఎందుకు కదిలింది. మోటార్లు మునిగినప్పుడు ఈ ఖర్చు అంతా నిర్మాణ సంస్థ భరిస్తుంది అని చెప్పినట్లే..ఇప్పుడు కూడా నష్టాన్ని భరించి నిర్మాణ సంస్థే పనులు చేస్తుంది అని ప్రకటిస్తున్నారు. ఇంజనీర్స్ చెపుతున్న దాని ప్రకారమే కాఫర్ డ్యామ్ కట్టి ఇప్పుడు రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. అసలు నిర్మాణాలు ఎందుకు లోపభూయిష్టంగా మారాయి...అప్పుడు మోటార్లు మునిగినా..ఇప్పడు బ్యారేజ్ పిల్లర్లు వంగినా లోపాలపై ఫోకస్ కంటే కూడా ఆ తప్పులను కంపెనీలే సరిదిద్దుతాయని చెప్పటం వెనకే పెద్ద కుట్ర ఉంది అనే అనుమానాలను కొంత ఇంజినీర్లు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ వివిధ వర్గాల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ కు తాజా పరిణామాలు మరింత నష్టం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.