Telugu Gateway
Telangana

మరి శిక్ష కూడా మేమే వేసుకుంటాం అని కేటీఆర్..హరీష్ చెపుతారా?!

మరి శిక్ష కూడా మేమే వేసుకుంటాం అని కేటీఆర్..హరీష్ చెపుతారా?!
X

ఎవరు ..ఎవరిపై అయినా కోర్టు కు వెళ్లొచ్చు. ఇందులో తప్పు పెట్టాల్సింది ఏమి లేదు. బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తీరు మాత్రం విచిత్రంగా ఉంది అనే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జస్టిస్ పీసి ఘోష్ ఇచ్చిన నివేదికపై పక్షం రోజుల వ్యవధిలో ఆయన రెండు సార్లు హై కోర్టు ను ఆశ్రయించారు. ఆదివారం నాడు ఈ నివేదికను తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో పాటు చర్చ కూడా చేపట్టనుండటంతో రెండవసారి మాజీ సీఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లు ఆగమేఘాల మీద కోర్టు ను ఆశ్రయించి అసెంబ్లీ లో ఈ అంశంపై చర్చించినా ఈ నివేదిక ఆధారంగా తమ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. హై కోర్టు లో తాము దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పు వెలువడే వరకు ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని తాజాగా దాఖలు చేసిన పిటిషన్ లో అభ్యర్ధించారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కెసిఆర్ పదే పదే కోర్టు ను ఆశ్రయిస్తున్నారు తప్ప..ఆయన అసెంబ్లీ కి హాజరు కావటానికి ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదు. అసలు కెసిఆర్ అసెంబ్లీ కి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోగలదా అంటూ ప్రకటనలు చేస్తారు.

మరి ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు కెసిఆర్ అసెంబ్లీ వచ్చి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ నాయకులు చెపుతున్నట్లు ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం ఎందుకు చేయటం లేదు. ఎప్పటిలాగానే ఇప్పుడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు లు కూడా కాళేశ్వరంపై చర్చ సందర్బంగా కెసిఆర్ అసెంబ్లీ కి రావాల్సిన అవసరం లేదు అని...తాము అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెపితే చాలు అంటూ మీడియా సాక్షిగా చెపుతూ వస్తున్నారు. అధికారంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అంతా తానే అని చెప్పుకున్నారు. తానే రక్తాన్ని చెమటగా మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసినట్లు చెప్పుకున్నారు కూడా. ఇప్పుడు జస్టిస్ పీసి ఘోష్ కమిషన్ కూడా తన నివేదికలో మాజీ కెసిఆరే అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు నిగ్గుతేల్చింది.

ఆయన తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లను కూడా కమిషన్ తప్పుపట్టింది. అసెంబ్లీ లో ఈ అంశంపై చర్చించి ఇందుకు బాద్యులు అయిన వారిపై చర్యలకు నిర్ణయం తీసుకుంటే అప్పుడు కూడా కెసిఆర్ తరపున ఆ శిక్ష కూడా కెసిఆర్ తరపున తాము వేసుకుంటామని కేటీఆర్, హరీష్ రావు లు చెపుతారా అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఎద్దేవా చేశారు. దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో డొల్లతనం ఇప్పటికే బయటపడింది. అసెంబ్లీ లో చర్చ తర్వాత ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. వివాదాలు చుట్టుముట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నిజంగా కెసిఆర్ తెలంగాణ ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే ఇంతకు మించిన అద్భుత అవకాశం మరొకటి ఉండదు అని కొంత మంది బిఆర్ఎస్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ కు రాకుండా..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ కి రాకుండా ఉంటున్న కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ధారుణంగా దెబ్బతీస్తున్నారు అనే చర్చ బిఆర్ఎస్ నేతల్లో కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ కాళేశ్వరం నివేదిక, విద్యుత్ కమిషన్ నివేదిక విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది కూడా ఇప్పుడు కీలకంగా మారబోతుంది.

Next Story
Share it