జూబ్లిహిల్స్ సొసైటీలో మరో గోల్ మాల్ డీల్!
180 కోట్ల భూమిని 40:60 కింద డెవలప్ మెంట్ కు అప్పగింత
చర్యలు ప్రారంభించిన కొత్త కమిటీ
హైదరాబాద్ వంటి నగరంలో ఎక్కడైనా ఖరీదైన స్థలం డెవలప్ మెంట్ కి ఇస్తే..ఫిఫ్టీ..ఫిఫ్టీ వాటా ఇవ్వటంతోపాటు గుడ్ విల్ కింద కూడా కోట్ల రూపాయలు ఇస్తారు. ఇది నిర్మాణ రంగంలో ఉన్న వారికి అందరికీ తెలిసిన విషయమే.అలాంటిది జూబ్లిహిల్స్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలోని స్థలంతో ఇలాంటి ఒప్పందం అంటే భూ యాజమానిదారు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది సొసైటీ స్థలం అయితే ఆ సొసైటీకి మరింత మేలు జరిగేలా చూడాలి. కానీ ఇక్కడ మాత్రం జరిగింది అందుకు భిన్నం. ఈ ఒప్పందం సొసైటీకి ప్రయోజనం చేకూర్చటం కంటే కూడా సొంతానికి ప్రయోజనం చేకూర్చటం అన్న అంశంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది. జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ వన్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన సొసైటీకి 6072 గజాల స్థలం ఉంది. ఇక్కడ ధర గజానికి తక్కువలో తక్కువగా మూడు లక్షల రూపాయలపైనే ఉంటుందని సొసైటీ వర్గాలు తెలిపాయి. ఈ స్థలం విలువే ఏకంగా 180 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. ఇంతటి కీలక స్థలాన్ని జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన గత పాలక మండలి మంతెన గ్రూప్ నకు డెవలప్ మెంట్ కు అప్పగించిందని సొసైటీ సభ్యులకు పంపిన స్టేటస్ రిపోర్ట్ లో నూతన కమిటీ వెల్లడించింది. అది కూడా 40:60 లెక్కన మంతెన గ్రూప్ కు అప్పగించినట్లు అందులో పేర్కొన్నారు. గత కమిటీలో అధ్యక్ష, కార్యదర్శులుగా నరేంద్రచౌదరి, హనుమంతరావులు ఉన్న విషయం తెలిసిందే.
ఇంతటి విలువైన భూమికి ఆ గ్రూప్ 2 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిందని నివేదికలో వెల్లడించారు. అంతే కాదు...ఈ ఒప్పందం సొసైటీ ప్రయోజనాలకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చేదిగా లేకపోవటంతోపాటు..అత్యంత హానికరంగా ఉండటంతో ఈ భూమిని సొసైటీకి మరింత ప్రయోజనం చేకూర్చేలా వాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సభ్యులకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత కమిటీలో కీలక చక్రం తిప్పిన వారే అనధికారికంగా గుడ్ విల్ కింద కోట్ల రూపాయలు పొందినట్లు సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతోపాటు సొసైటీలో జరిగిన పరిణామాలు అన్నీ అక్రమార్కుల వ్యక్తిగత ప్రయోజనం పొందేందుకు ఉపయోగించుకున్నట్లు స్పష్టం అవుతోందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని విషయాలు త్వరలోనే నిగ్గుతేలటం ఖాయం అని సొసైటీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.