Telugu Gateway
Telangana

చెప్పేది ఎక్కువ ..చేసేది తక్కువ

చెప్పేది ఎక్కువ ..చేసేది తక్కువ
X

జర్నలిస్టుల విషయంలో కెసిఆర్ సర్కారు తీరు ఇది. ఎప్పుడో పద్నాలుగు ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం జర్నలిస్టులకు రెండు చోట్ల స్థలాలు కేటాయించింది. కాకపోతే అది సుప్రీంకోర్ట్ వరకు కేసు నడిచి ఈ ఏడాది ఆగస్టులో తుది తీర్పు వెలువడింది. అప్పటి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ జర్నలిస్టుల కేసు క్లియర్ చేశారు. ఆ సమయంలో అయన కీలక వ్యాఖలు చేశారు. పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లు ఇతర వర్గాలతో పోలిస్తే జర్నలిస్టులకు జీతాలు చాలా తక్కువగా ఉంటాయని ....అందుకే వీళ్లకు కేటాయించిన స్థలం వెంటనే ఇవ్వటంతో పాటు...ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మరి కొన్ని రోజులు పోతే ఈ తీర్పు వచ్చి నాలుగు నెలలు అవుతుంది. ఈ తీర్పు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ కుటంబానికి చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో 'జర్నలిస్టుల ఇంటి దీపం కెసిఆర్ ' అంటూ ఒక వ్యాసం ప్రచురితం అయింది. అందులో ముఖ్యంగా ఇళ్ల స్థలాల అంశాన్ని కూడా ప్రస్తావించారు. అందులోని కొంత భాగం ఇలా ఉంది. ' 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక సందర్భంలో జర్నలిస్టుల ఇండ్ల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద చర్చ జరిగింది. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇంటి జాగ ఇప్పించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి చెప్పారు. న్యాయస్థానంలో ఉన్న కేసును పరిష్కరించేందుకు కృషిచేస్తానని తెలిపారు. హౌజింగ్‌ సొసైటీ కేసు గురించి స్వయంగా ఫాలోఅప్‌ చేశారు. స్వయంగా అడ్వొకేట్‌ జనరల్‌, లా సెక్రటరీలతోపాటు ఢిల్లీలోని న్యాయనిపుణులతో చర్చలు జరిపారు.

ప్రభుత్వ ముఖ్యులను అనేక పర్యాయాలు సుప్రీంకోర్టుకు, న్యాయ నిపుణుల వద్దకు పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదల, మార్గదర్శనం వల్లే ఈ వివాదం ఎట్టకేలకు కొలిక్కివచ్చి కథ సుఖాంతమైంది. ఆయన తరచూ ఒక మాట చెప్తుంటారు.. 'అల్లాహ్‌ కే నజర్‌ మే దేర్‌ హై మఘర్‌ అందేర్‌ నహీ హై' అని. సమస్య పరిష్కారంలో జాప్యం జరిగి ఉండవచ్చు కానీ, సమస్య పరిష్కరించాలన్న దృఢసంకల్పం కేసీఆర్‌ మదిలో ఉన్నది కాబట్టే పరిష్కారం లభించింది.' అంటూ రాశారు. పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కరానికి ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో అఫిడవిట్ వేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సుప్రీం కోర్ట్ క్లియర్ చేసింది. అయినా కానీ...తీర్పు వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా పాత సొసైటీ లో ఉన్న 1100 మంది సమస్య పట్టించుకోవడంలేదు. అదే టైములో ఇంకా అర్హులుగా వున్నా వేలాది మంది జర్నలిస్టుల గురించి అసలు ఏ మాత్రం ఆలోచన చేస్తున్నట్లు ఎక్కడా కనిపించటం లేదు. సీఎం కెసిఆర్ స్వయంగా సుప్రీం కోర్ట్ కేసు క్లియర్ అయినా వెంటనే సమస్య పరిష్క్రరిస్తానని పదుల సార్లు చెప్పారు. ఇదే అంశంపై తీర్పు వచ్చిన నిమిషాల్లోనే మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ఆ వెంటనే వదిలేశారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశంలో సుప్రీం తీర్పు రాగానే సొంత పత్రికలో మాత్రం జర్నలిస్టుల కంటి వెలుగు అంటూ వ్యాసం మాత్రం వచ్చింది. ఇది పైన ఉన్న ఫోటో లో చూడొచ్చు.

Next Story
Share it