Telugu Gateway
Telangana

ఏంటో ఈ స్పెషల్ టాలెంట్

ఏంటో ఈ స్పెషల్ టాలెంట్
X

తాజా బదిలీల్లోనూ లేని జయేష్ పేరు

అధికార వర్గాల్లో విస్మయం

రేవంత్ తో కలిసి దావోస్ ట్రిప్ కు రెడీ

బిఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారుల్లో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఒకరు. కేటీఆర్ తో కలిసి అయన చేసినన్ని విదేశీ పర్యటనలు మరెవరు చేసి ఉండరు అనే చర్చ ఐఏఎస్ వర్గాల్లో ఉంది. అసలు తెలంగాణ ఐఏఎస్ ల్లో జయేష్ రంజన్ అంతటి సమర్థుడు ఎవరూ లేరనే తరహాలో ఆయన్ని సంవత్సరాలకు...సంవత్సరాలుగా ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగించడంపై అప్పటిలోనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ సర్కారు కీలక పదవులు అన్ని సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ వంటి వారికే అప్పగించింది అని విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సోమేశ్ కుమార్ ను సలహాదారు పదవి నుంచి తప్పించారు...అరవింద్ కుమార్ ను ఏ మాత్రం ప్రాధాన్యతలేని విపత్తుల నిర్వహణ శాఖకు బదిలీ చేశారు. కానీ ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ మాత్రం అక్కడే ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు రెండు సార్లు ఐఏఎస్ ల బదిలీలు చేసినా జయేష్ రంజన్ ను అక్కడ నుంచి కదిలించకపోవటం కూడా అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాతాహవరణం చూస్తుంటే జయేష్ రంజన్ ఇక్కడ కూడా జండా పాతేసినట్లే కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అంతే కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి జయేష్ రంజన్ మరో సారి దావోస్ టూర్ లో పాల్గొనబోతున్నారు. గత ప్రభుత్వంలో ఐటి, పరిశ్రమల శాఖలో ఇష్టానుసారం వ్యవహరించారు అనే పేరున్న జయేష్ రంజన్ తాజా బదిలీల్లో కూడా సేఫ్ గానే ఉండటం ఆసక్తికర చర్చకు కారణం అవుతోంది. గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఐటి, పరిశ్రమల శాఖ అంటే ముఖ్యంగా టిఎస్ఐఐసి లో సాగిన దందాలపై ఫోకస్ పెడితే కళ్ళు చెదిరే విషయాలు బయటపడతాయని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఉదాహరణకు టిఎస్ఐఐసి లో వేసిన రోడ్ల విషయంలోనే కోట్ల రూపాయల మేర స్కాం లు జరిగాయని..తొలుత పది కోట్ల రూపాయల రోడ్ పనిని ఒక కాంట్రాక్టర్ కు ఇచ్చి..తర్వాత అనుబంధ ఒప్పందం కింద 33 .41 కోట్ల రూపాయల పనులు అప్పగించారు అని...ఇది నిబంధనలకు విరుద్ధం అని అధికారులు చెపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి అని...జయేష్ రంజన్ ను అక్కడ పెట్టుకుని గత ప్రభుతంలో జరిగిన అక్రమాలు..అవినీతిపై రేవంత్ రెడ్డి సర్కారు ఎలా నిజాలు నిగ్గుతేలుస్తుంది అనే చర్చ సాగుతోంది. అయితే కొంత మంది మాత్రం దావోస్ టూర్ తర్వాత జయేష్ రంజన్ బదిలీ ఉండే అవకాశం ఉంది...అని...ఈ పోస్ట్ కు సరిపోయే అధికారి కోసం అన్వేషిస్తున్నట్లు చెపుతున్నారు.

Next Story
Share it