Telugu Gateway
Telangana

నియోజకవర్గాల ఎంపికతో పెరిగిన అనుమానాలు!

నియోజకవర్గాల ఎంపికతో పెరిగిన అనుమానాలు!
X

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ, జనసేన పొత్తు ఫిక్స్ అయింది. బీజేపీ ని పక్కన పెట్టి మరీ తమ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నాయి అని తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. మరి ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ తో పొత్తు పెట్టుకున్న జనసేన తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఒంటరిగా పోటీ చేయటం వెనక మతలబు ఏమిటి?. పొత్తు ఉంటే రెండు రాష్ట్రాల్లో ఉండాలిగాని...ఒక చోట పొత్తు...మరో చోట ఒంటరి పోటీ అంటే దీని వెనక వేరే లెక్కలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లోనే జనసేన కు ఎక్కువ ఓటు బ్యాంకు ఉంటుంది అనే విషయం తెలిసిందే. అలాంటప్పుడు తక్కువ ఓటు బ్యాంకు ఉన్న చోట సొంతంగా పోటీకి నిర్ణయం తీసుకోవటం రాజకీయ వర్గాలను ఆశ్ఛర్యానికి గురిచేస్తున్న విషయం. అన్నింటికంటే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే తాజాగా తెలంగాణాలో జనసేన పోటీ చేయాలని నిర్ణయించిన నియోజకవర్గాల జాబితా చూస్తేనే దీనిపై అనుమానాలు మరింత బలోపేతం అవుతున్నాయి. మొత్తం 32 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బరిలోకి దిగనున్నట్టు తెలంగాణ జనసేన పార్టీ ఉపాధ్యక్షడు బి. మహేందర్ రెడ్డి జాబితా విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో జనసేన ఎనిమిది చోట్ల బరిలో ఉండబోతుతోంది. తెలంగాణ లో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో ఒక్క సీటు మాత్రమే కాస్త అధికార బిఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది అని..అది కూడా ఆ నేత వచ్చే ఎన్నికల్లో ఓటు కు ఐదు వేల రూపాయలు ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉండటమే ఒక కారణం అనే చర్చ ఉంది. ఈ తరుణంలో జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, కొత్తగూడెం, మధిర, ఇల్లందు, పాలేరు సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవరాగాల్లో బరిలోకి దిగాలని నిర్ణయించింది.

దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొమ్మిది సీట్లలో బరిలో నిలవనున్నారు. ఇందులో కూకట్ పల్లి, ఎల్ బి నగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పఠాన్ చెరువు, సనత్ నగర్, ఉప్పల్, మేడ్చల్ , మల్కాజిగిరి ఉన్నాయి. అంటే జనసేన పోటీ చేయనున్న ఈ 32 సీట్లలో పదిహేడు సీట్లు ఉమ్మడి ఖమ్మం, గ్రేటర్ పరిథిలోనే ఉన్నాయి. మిగిలినవి వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పాలకుర్తి, హుస్నాబాద్, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, రామగుండం, మంథని, జగిత్యాల, నకిరేకల్, కోదాడ, హుజుర్ నగర్, మునుగోడు, ఖానాపూర్, నాగర్ కర్నూల్ ఉన్నాయి. ఈ నియోజకవర్గాల జాబితా చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చి అధికార బిఆర్ఎస్ కు ఉపయోగ పడేందుకే వీటిని ఎంపిక చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అని...దీని వెనక అధికార పార్టీ పెద్దలు ఉన్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ లో ఏమి జరిగినా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు బిఆర్ఎస్ సర్కారు పై విమర్శలు చేసిన దాఖలాలు లేవు. దీంతో పాటు జనసేన ఎంపిక చేసుకున్న నియోజక వర్గాలు కూడా ప్రజల్లో అనుమానాలకు తావు ఇచ్చేలా ఉన్నాయని రాజాకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణాలో బరిలోకి దిగే పవన్ కళ్యాణ్ అధికార బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ను టార్గెట్ చేస్తారా లేక వేరే పార్టీలను టార్గెట్ చేస్తారా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it