Telugu Gateway
Telangana

జగన్ లైన్ లోనే కవిత వ్యాఖ్యలు!

జగన్ లైన్ లోనే కవిత వ్యాఖ్యలు!
X

రాజకీయ నాయకులు సినిమాటిక్ భాష వాడటం ఎప్పటి నుంచో ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో అయితే ఆ సమయంలో ఏవి పాపులర్, హిట్ సినిమాలో వాటిలో డైలాగులు వాడుతూ ప్రచారం కూడా చేసుకుంటారు. ప్రధాని మోడీ కూడా ఒకసారి బాహుబలి గురించి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. కొద్ది రోజుల క్రితమే వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన 2.0 గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలం అయింది అని...ఈ సారి మాత్రం జగన్ 2.0 కచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పారు. జగన్ 2.0 లో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని వెల్లడించారు.

ఇది జరిగిన కొద్ది రోజులకే బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా సోమవారం నాడు కచ్చితంగా బిఆర్ఎస్ 3.O వస్తది… కెసిఆర్ 3.0 వస్తుంది అని చెప్పారు. అప్పుడు ఉద్యమకారులందరికి న్యాయం చేసే బాధ్యత తనది అని అన్నారు. తన చేతిలో ఎక్కడ ఎలాంటి అవకాశమున్నా ఉద్యమకారులకే మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఎవరూ దిక్కు లేనప్పుడు గులాబీ జెండా మోసిన ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందేనాని వ్యాఖ్యానించారు. ఆ బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే కాకుండా..తెలంగాణ లో ఉన్న ఉద్యమకారులు అందరికి తాను మాట ఇస్తున్నట్లు తెలిపారు. మధ్యలో వచ్చినోళ్ళు మనోళ్లు కాదు అనటం లేదు అని...కానీ మొదటి నుంచి ఉన్న వాళ్లకు రావాల్సిన ప్రాధాన్యత రావాల్సిందే అన్నారు. జగన్ ఇటీవలే తన 2.0 గురించి చెపితే ..ఇప్పుడు కవిత కెసిఆర్, బిఆర్ఎస్ 3.O గురించి చెప్పారు.

Next Story
Share it