Telugu Gateway
Telangana

రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల మోసం...లెక్క‌ల్లోకి రాని 800 కోట్ల లావాదేవీలు

రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల మోసం...లెక్క‌ల్లోకి రాని 800 కోట్ల లావాదేవీలు
X

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల అక్ర‌మాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆదాయ ప‌న్ను శాఖ జ‌రిపిన సోదాల్లో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు గుర్తించారు. ఒక‌టి కాదు..రెండు కాదు ఏకంగా లెక్క‌ల్లోకి రాని 800 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు లావాదేవీల‌ను ఐటి శాఖ గుర్తించింది. అదే స‌మ‌యంలో ఆ సంస్థ‌ల నుంచి 1.64 కోట్ల రూపాయ‌ల లెక్క‌ల్లోకి రాని న‌గ‌దును స్వాదీనం చేసుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ తోపాటు తెలంగాణ రాష్ట్రాల్లో కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ప‌లు రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల‌కు సంబందించిన లావాదేవీల‌పై జ‌న‌వ‌రి 5వ తేదీని ఐటి శాఖ దాడులు ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా ప‌లు డాక్యుమెంట్లు, చేతితో రాసిన పుస్త‌కాల‌ను స్వాధీనం చేసుకున్నారు. భూముల డెవ‌ల‌ప్ మెంట్, నిర్మాణ రంగంలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ఈ సంస్థ‌ల‌పై దాడులు నిర్వ‌హించారు.

ఇందులో స్కందాన్షి ఇన్ ఫ్రాతోపాటు న‌వ్య డెవ‌ల‌ప‌ర్స్ వంటి సంస్థ‌లు ఉన్నాయి. ఈ సంస్థ‌లు క‌ర్నూలు,, అనంత‌పురం, క‌డ‌ప‌, నంద్యాల‌, బ‌ళ్ళారిలో కార్య‌క‌లాపాలు సాగిస్తున్నాయి. ప్ర‌త్యేక సాఫ్ట్ వేర్ అప్లికేష‌న్ ద్వారా ఆయా సంస్థ‌ల వ‌ద్ద ఉన్న డిజిట‌ల్ డేటాను కూడా ఐటి శాఖ అధికారులు సేక‌రించారు. లెక్క‌ల్లోకి రాని న‌గ‌దు లావాదేవీల‌కు సంబంధించిన వివ‌రాలు ఆటోమేటిగ్గా క‌న్పించ‌కుండాపోయేలా ఓ సంస్థ సాఫ్ట్ వేర్ ను ఉప‌యోగించిన‌ట్లు ఐటి శాఖ అధికారులు గుర్తించారు. ఈ సంస్థ‌లు భారీ ఎత్తున న‌గ‌దు లావాదేవీలు జ‌రిపిన‌ట్లు గుర్తించారు. ఈ న‌గ‌దును భూములు కొనుగోలుతోపాటు ఇత‌ర నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌కు వాడార‌ని తేల్చారు. ఈ రియ‌ల్ సంస్థ‌ల‌కు సంబంధించిన లావాదేవీల‌పై త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతుంద‌ని ఐటి శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Next Story
Share it