Telugu Gateway
Telangana

ఐటి దాడులతో వణుకుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలు

ఐటి దాడులతో వణుకుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలు
X

కంపెనీలతో పాటు..కొనుగోలుదారుల్లోనూ టెన్షన్ టెన్షన్

గత కొన్ని ఏళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూసుకెళ్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, ఢిల్లీ వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో రేట్లు కాస్త తక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా హైదరాబాద్ మార్కెట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇది కూడా హైదరాబాద్ మార్కెట్ లో రేట్ల పెరుగుదలకు కారణం అవుతోంది. అదే సమయంలో సంపన్నులు..మిగులు నిధులు ఉన్న వారు పెట్టుబడి గా రియల్ ఎస్టేట్ రంగంలో, ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్లో పెద్ద ఎత్తున నిధులు గుమ్మరిస్తున్నారు. ఇవన్నీ కూడా హైదరాబాద్ లో ఊహించని రీతిలో రేట్ల పెరుగుదలకు కారణం అయింది అని ఈ రంగంలోని వారు చెపుతున్నారు అయితే గత కొన్ని రోజులుగా వరసపెట్టి హైదరాబాద్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఆదాయ పన్ను (ఐటి) శాఖ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇది అటు కంపెనీలను, ఆయా కంపెనీల్లో కొనుగోలు దారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కొద్ది నెలల వ్యవధిలోనే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కీలక రియల్ ఎస్టేట్ సంస్థలు వాసవి, సుమధుర, ఫీనిక్స్ , హానర్, వంశీ రామ్ బిల్డర్స్ వంటి కంపెనీలపై వరస ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఒకటి, రెండు తప్ప ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ కొంత మొత్తాలను బ్లాక్ కింద...మిగిలిన మొత్తాలను వైట్ రూపంలో తీసుకుంటాయనే విషయం తెలిసిందే.

ఇప్పుడు కంపెనీలు ఏమైనా కేసుల్లో ఇర్రుక్కుపోతే తాము కూడా చిక్కుల్లో పడాల్సి వస్తోంది అన్న భయం కొనుగోలు దారుల్లో ఉంది. అదే సమయంలో కంపెనీలు కూడా ఈ వరస దాడులతో టెన్షన్ టెన్షన్ తో కాలం గడుపుతున్నాయి. తాజా గా హైదరాబాద్ కేంద్రంగా సాహితి ఇన్ఫ్రా స్కాం మరో కలకలం రేపింది. ఏకంగా 900 కోట్లు వసూల్ చేసిన ప్రమోటర్లు ఇన్వెస్టర్లను దారుణంగా ముంచారు. ఇప్పడు ఈ కంపెనీ ఎండి లక్ష్మీనారాయణ అరెస్ట్ కాగా..కంపెనీ డీల్స్ పై ఈ డీ కూడా రంగంలోకి దిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీల పై ఐ టి దాడుల వెనక పన్ను అంశాలతో పాటు పలు కంపెనీల్లో రాజకీయ నేతల భాగస్వామ్యం వంటి అంశాలు కీలకంగా ఉంటున్నాయని చెపుతున్నారు. ఎందుకంటే కొంత మంది నేతలు ఆక్రమమార్గంలో సంపాదించినా మొత్తాలను రియల్ ఎస్టేటులో పెట్టుబడి పెడుతున్నారని చెపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని అధికార టిఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ల మధ్య రాజకీయ ఫైట్ తీవ్రరూపం దాల్చటం తో వచ్చే ఏడాది అంతా ఇలాగే సాగే అవకాశం ఉండనే టెన్షన్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఉంది. ఇది ఎంతో కొంత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ప్రభావం చూపించే అంశమే అని చెపుతున్నారు.

Next Story
Share it