Telugu Gateway
Telangana

మోడీ మౌనం...ఐటి దాడులు పంపే సంకేతాలు ఏంటి?!

మోడీ మౌనం...ఐటి దాడులు పంపే సంకేతాలు ఏంటి?!
X

ఐటి శాఖ ఎవరి మీద అయినా...ఎప్పుడు అయినా దాడి చేయ వచ్చు. ముందస్తు సమాచారం తో అయినా...లేక వివిధ మార్గాల్లో వచ్చిన సమాచారం ఆధారంగా అయినా. మాములుగా అయితే ఇది ఏ మాత్రం తప్పు కాదు. కానీ గత కొంత కాలంగా..ముఖ్యంగా మోడీ ప్రధాని అయినా తర్వాత జరుగుతున్న ఐటి, ఈడీ దాడులు గతంలో ఎప్పుడూ ఇంత విమర్శలు ఎదుర్కోలేదు . తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ గురువారం నాడు పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న కాంట్రాక్టర్, పారిశ్రామిక వేత్త పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై జరిగిన ఐటి దాడులు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. కొద్ది నెలల క్రితమే పొంగులేటి శ్రీనివాస రెడ్డి బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి తర్జన భర్జనల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఒక దశలో అయన బీజేపీ లో కూడా చేరతారు అని ప్రచారం జరిగింది. రాజకీయంగా అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత అయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఖమ్మంలో ప్రధాన పోటీ కాంగ్రెస్ వెర్సస్ బిఆర్ఎస్ మద్యే ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. బీజేపీ పోటీ చేస్తున్నా కూడా ఆ పార్టీ కి ఖమ్మంలో ఏ మాత్రం పట్టు లేదు అని చెప్పొచ్చు. అలాంటిది సరిగ్గా పొంగులేటి నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్న రోజు గురువారం ఉదయమే ఐటి బృందాలు అటు ఖమ్మం. ఇటు హైదరాబాద్ లో దాడులు ప్రారంభించాయి. ఈ టైమింగ్ చూస్తే ఇది పక్కా రాజకీయ కోణంలోనే సాగింది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి రెండు తప్ప...మిగిలిన సీట్లు అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అనే అంచనాలు ఉన్న తరుణంలో జరిగిన ఈ ఐటి దాడులు కీలకంగా మారాయి. ఇది బీజేపీ, బిఆర్ఎస్ రెండూ కలిసి చేస్తున్న పని అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పొంగులేటి, భట్టి విక్రమార్క ఎటాక్ ప్రారంభించారు.

దీన్ని ఎక్కువ మంది నమ్మటానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకటి అయితే బిఆర్ఎస్ పార్టీ అత్యంత ఇరకాటంలో పడిన అంశం ఈ మధ్య కాలంలో ఏదైనా ఉంది అంటే అది కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు, డ్యామ్ కు పగుళ్లు , అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా సీపేజ్ ఘటనలు. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ సంచలనం రేపిన ఈ విషయంపై ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవటంతో ప్రజల్లో మరిన్ని అనుమానాలు పెరిగాయని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ నే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో డొల్లతనం పై నివేదిక ఇచ్చింది. ఇదే బీజేపీ నేతలు అందరూ కాళేశ్వరం కెసిఆర్ కు ఎటిఎం గా మారింది అంటూ విమర్శలు అయితే చేస్తూ వస్తున్నారు కానీ...కాళేశ్వరం లో లోపాలు బహిర్గతం అయినా మోడీ ఒక్క మాట కూడా మాట్లాడక పోవటంతో రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న బీజేపీ, బిఆర్ఎస్ ఒక్కటే ...రాజకీయంగా ఈ రెండు పార్టీలో సహకరించుకుంటున్నాయి అనే విమర్శలకు ఊతం ఇచ్చినట్లు అయింది అనే అభిప్రాయం బలంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ విషయం తెలంగాణాలో క్షేత్ర స్థాయి వరకూ వెళ్ళింది అని...ఇప్పుడు పొంగులేటి పై ఐటి దాడులు...కాళేశ్వరం పై మోడీ మౌనం ఖచ్చితంగా అధికార బిఆర్ఎస్ ను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అని చెపుతున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై ఐటి దాడులు చేయటం తప్పు అని ఎవరూ అనరు..కానీ చేసిన టైమింగ్ చూస్తే మాత్రం ఇది టార్గెట్ గా చేసినట్లు ప్రజల్లోకి వెళుతుంది అని చెప్పొచ్చు.

Next Story
Share it