Telugu Gateway
Telangana

బిజెపి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి

బిజెపి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
X

ఐటిఐఆర్ పై రాజకీయ సవాళ్ళు నడుస్తూనే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ప్రాజెక్టు పోయిందని..తమ తప్పులను కూడా బిజెపిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం నాడు సీఎం కెసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనికి మంత్రి కెటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఐటీఐఆర్ గురించి బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధిని పణంగా పెట్టి ఐటిఐఆర్ ని రద్దు చేసిన కేంద్రంలో ఉన్న తన సొంత ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పలుమార్లు పార్లమెంట్ సాక్షిగా ఐటిఐఆర్ ని రద్దు చేస్తున్నామని ప్రకటించిన కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ కి లేఖ రాసి నిజాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, బండి సంజయ్ కి హితవు పలికారు.

కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎంతటి అబద్ధాలు నైనా మాట్లాడే నైజం బీజేపీ ది అని, మరోవైపు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఐటీఐఆర్ కోసం తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని కేటీఆర్ అన్నారు. జూన్ 2014 లో అంటే తెలంగాణ వచ్చిన మొదటి నెలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీఐఆర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారన్నది వాస్తవం అన్నారు. మళ్లీ 2014 సెప్టెంబర్ లో పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమొరాండం సమర్పించామని, దీంతోపాటు అనేకసార్లు ప్రధానికి, కేంద్ర ఐటి శాఖ మంత్రికి విజ్ఞప్తులు తమ ప్రభుత్వం తరఫున స్వయంగా తానే అందించానని కేటీఆర్ తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన ఐటీఐఆర్ అమలు కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణం అనడం విచిత్రం, విడ్డూరం, పచ్చి అబద్దం అన్నారు. ఒక్క తెలంగాణ లోనే కాదు, ఐటీఐఆర్ మంజూరు అయిన ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఆ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అన్న సంగతి తెలియకపోవడం తెలంగాణ బీజేపీ అధ్యక్షుని అజ్ఞానాన్ని సూచిస్తుందన్నారు.

అటు కేంద్ర ప్రభుత్వంలో... ఇటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బెంగళూరు ఐటీఐఆర్ ప్రాజెక్టులో ఒక తట్టెడు మట్టి కూడా లేవలేదు అన్న వాస్తవం స్వీకరించాలని కేటీఆర్ తెలిపారు. బెంగళూరులో, ఆంధ్రప్రదేశ్ లో, ఒరిస్సా లోని భువనేశ్వర్ లో ఐటిఐఆర్ మొదలు కాకపోవడానికి కూడా కారణం కేసీఆర్ ప్రభుత్వమేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఐటిఐఆర్ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడనికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అని, ముందుగా ఆ విషయాన్ని గుర్తించాలన్నారు. సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేక కేవలం అసత్యాలు, అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూసే బండి సంజయ్ ప్రయత్నాలు ఎన్నడూ సఫలం కావన్నారు. ఇప్పటికైనా ఐటీఐఆర్ ను రద్దు చేస్తామని ప్రకటించిన తమ సొంత పార్టీ కి చెందిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటనను మరోసారి చదువుకొని తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగర యువత కి ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు.

Next Story
Share it