కెసిఆర్ మోడల్ అంటే ఇదేనా?!

ప్రభుత్వ భూములు అమ్మాలి. ఆ డబ్బు పథకాలకు పంచాలి. మళ్ళీ గెలవాలి. అప్పుడు ఏమైనా మిగిలితే వాటి సంగతి చూడాలి. ఇలాగే ఉంది తెలంగాణ సర్కారు తీరు. ఎకరాలుగా ఉన్న భూములే కాదు...కెసిఆర్ సర్కారు చివరకు గజాలను కూడా వదలటం లేదు. అదేంటి అంటే ఆక్రమణలు కాకుండా విక్రయిస్తున్నాం అనే సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వమే ప్రభుత్వ భూములు కాపాడుకోలేకపోతే ఇక ఈ ప్రభుత్వం ప్రజలకు రక్షణ ఇవ్వగలుగుతుంది అన్న సందేహం రావటం ఖాయం. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రా వాళ్ళు తెలంగాణ భూములు అమ్ముతున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేసిన సీఎం కెసిఆర్ ఇప్పుడు అయన తన రెండవ టర్మ్ తో అసలు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఏమి లేకుండా చేసేలా ఉన్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం భూములు అమ్మకం స్పీడ్ చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం రావటం సహజం. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని ఖరీదైన భూములు అమ్ముతూ...అరుదైన అవకాశం అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరి భూములు అమ్మకానికి పెడుతున్నారు. ఎన్నికల లోపు పెద్ద ఎత్తున భూములు అమ్మి ...ఆ నిధులతో రాజకీయ ప్రయోజనం కల్పించే పథకాలు అమలు చేసి లబ్ది పొందాలనే ప్లాన్ అన్న మాట. వివిధ రకాల ప్రాజెక్ట్ ల కోసం ఒక వైపు ప్రజల భూములు సేకరిస్తారు..మరో వైపు మాత్రం ప్రభుత్వ భూములు మాత్రం అమ్మి తమ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నారు అనే విమర్శలను ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోంది.