Telugu Gateway
Telangana

కెసిఆర్, కేటీఆర్ పారదర్శక పాలనకు ఇది నిదర్శనమా

కెసిఆర్, కేటీఆర్ పారదర్శక పాలనకు ఇది నిదర్శనమా
X

అధికారంలో ఉన్నంత కాలం కెసిఆర్ పదే పదే ఒక మాట చెప్పేవాళ్ళు. తెలంగాణ కోసం తాము అంతా తిని తినక పనిచేశాం...అటుకులు బుక్కి, కడుపు కట్టుకుని పనిచేశాం అంటూ అసెంబ్లీలో కూడా చెప్పారు. కానీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కాం తో పాటు ఒక్కొక్కటిగా అసలు విషయాలు అన్నీ బయటకి వస్తున్నాయి. అవినీతి నిరోధక శాఖ బుధవారం నుంచి రేరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో..అయన బంధువుల ఇళ్లలో జరిపిన దాడుల్లో కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. అయన గతంలో అత్యంత కీలకమైన హెచ్ఎండిఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్ గా ఉంటూనే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కూడా ఇంచార్జి డైరెక్టర్ గా కూడా విధులు నిర్వర్తించారు. అంటే ఒక వ్యక్తికి రెండు కీలక పోస్ట్ లు అన్న మాట. గతంలో ఈ శాఖ మంత్రిగా కేటీఆర్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. తమ శాఖలో అత్యంత పారదర్శకంగా...ఎలాంటి అవినీతి లేకుండా పాలన సాగించాం అని అయన కూడా పదే పదే చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఒక అధికారిపై దాడి జరిగితేనే ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడ్డాయి అంటే...పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఆ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి...అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పిన పనులు అన్ని ఆగమేఘాలమీద బాలకృష్ణ చేసిపెట్టే వాళ్ళు అని అధికార వర్గాలు చెపుతున్నాయి.

అందుకే రెండు కీలక పోస్ట్ లు అయన వద్దే పెట్టి తాము అనుకున్న పనులు అన్ని పెద్దలు, వాళ్లకు కావాల్సిన వాళ్ళు చేయించుకున్నారు అని చెపుతున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలు కోరుకున్న ఫైల్స్ మాత్రమే జెట్ స్పీడ్ లో పరిష్కారం అయ్యేవి కానీ...మిగిలిన ఫైల్స్ మాత్రం చాలా కాలం అలాగే పడి ఉండేవి అని ఇప్పుడు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. రేరా కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణ నివాసంలో జరిగిన ఏసీబీ దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం తో పాటు పది ఐ ఫోన్లు, పెద్ద ఎత్తున భూములకు సంబదించిన డాక్యుమెంట్స్ లభ్యం అయ్యాయి. వీటితో పాటు పెద్ద ఎత్తున బినామీ లావాదేవీలు కూడా జరిగినట్లు గుర్తించారు. లాకర్లు కూడా తెరిస్తే బాలకృష్ణ అక్రమాస్తుల మొత్తం విలువ నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల వరకు ఉండే అవకాశం అని చెపుతున్నారు. పారదర్శక పాలన ..అటుకులు బుక్కిన పాలనలోనే ఇంత అవినీతి ఉంటుందా అని అందరూ అవాక్కు అయ్యే పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలు కేవలం ఒక శాతం మాత్రమే అని ..పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఈ లెక్కలు ఊహ కు కూడా అందవని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it