Telugu Gateway
Telangana

కిషన్ రెడ్డి పై కేకలు..ఢిల్లీలో చర్చల జపం వెనక మర్మమేంటి?

కిషన్ రెడ్డి పై కేకలు..ఢిల్లీలో చర్చల జపం వెనక మర్మమేంటి?
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతల్లోనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తెలంగాణ సీఎం ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆ పార్టీ నేతల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో మాత్రం కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో కేకలు వేసే రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాత్రం ఏ విషయాన్ని అయినా సరే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రధాని మోడీ పై విమర్శలు చేయటానికి రేవంత్ రెడ్డి ఏ మాత్రం సాహసించటం లేదు. అంతా రెడీ అయిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ మెట్రో తొలి దశ టేకోవర్ కు సంబంధించి మంజూరు అయిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్ సి) రుణం ఆగిపోయింది అని...దీనికి ప్రధాన కారణం తెలంగాణ కు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఫస్ట్ ఫేజ్ టేకోవర్ , రెండవ దశకు అనుమతులు రాకుండా ఆయనే అడ్డుకుంటున్నారు అని చెప్పారు. తర్వాత కిషన్ రెడ్డికే కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయించాలని లేఖలు రాశారు. సీఎం లేఖల తర్వాత ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశాల తర్వాత చర్చలు ఎంతో ఫలప్రదంగా సాగాయి అని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. హైదరాబాద్ మెట్రో వ్యవహారాలపై సమగ్ర అధ్యయనం కోసం ఎస్ బిఐ క్యాప్స్ కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని..ఈ నివేదిక ప్రకారం ముందుకు వెళ్తాము అని ప్రకటించారు. కానీ ఈ పని ఏమీ ముందుకు సాగటం లేదు అంటూ మరో సారి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ ఊసు ఎత్తడం లేదు. కేంద్రంలోని మోడీ సర్కారు ఏమైనా తెలంగాణా ప్రభుత్వం కోరుకున్న ప్రాజెక్టులు అన్నీ ఇస్తుందా అంటే అదీలేదు. అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి అసలు ప్రధాని మోడీ పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కాంగ్రెస్ నేతల్లో పలు అనుమానాలు కారణం అవుతోంది.

ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్రంతో సఖ్యతతో ఉండి రాష్ట్రానికి అవసరం అయిన ప్రాజెక్ట్ లు తెచ్చుకోవటం...పనులు చేయించుకుంటే అది గొప్పవిజయంగానే చెప్పాలి. కానీ కేంద్రంలోని మోడీ సర్కారు తమకు ఏ మాత్రం సాయం చేయకపోయినా కూడా రేవంత్ రెడ్డి విమర్శలతో కాదు..చర్చలతోనే పరిష్కారం దొరుకుంది అని చెప్పటం వెనక ఎజెండా ఏంటా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా పదేపదే ఆరోపిస్తున్నారు. గతంలో ఈ ప్రాజెక్టును 'ఏటీఎం'గా మార్చారని విమర్శించిన బీజేపీ నాయకులు.. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే ఢిల్లీలో సైతం ధర్నా చేయడానికి సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆ తర్వాత సిబిఐ విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు, విచారణను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరేందుకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో కలిసి స్వయంగా ఢిల్లీలో సిబిఐ డైరెక్టర్‌ను కలుస్తామని ప్రకటించారు కానీ ఇంత వరకు అది అమలుకు నోచుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు మొదటి నుంచి అనుమానాలకు ఆస్కారం ఇచ్చేలా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో వేల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్లకు ఇప్పుడు ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ నుంచి కీలక అవినీతి కాంపోనెంట్స్ ను తప్పించటం ద్వారా అక్రమార్కులకు రేవంత్ రెడ్డి కొమ్ముకాసినట్లు స్పష్టంగా తేలిపోయింది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఒక వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నిత్యం విమర్శలు చేసుకుంటూ అవినీతిపరులకు రక్షించటం ద్వారా గత ప్రభుత్వానికి ..రేవంత్ రెడ్డి సర్కారుకు ఏ మాత్రం తేడా లేదు అని నిరూపించుకున్నారు అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it