Telugu Gateway
Telangana

కెసిఆర్ కు కాలం ఎదురుతిరిగిందా?

కెసిఆర్ కు కాలం ఎదురుతిరిగిందా?
X

అందులో ఎవరి ప్రమేయం లేదు. ఎవరూ శోధించి కనుగొన్న విషయం కూడా కాదు. కానీ సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న విషయాలు మాత్రం అధికార బిఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిని కెసిఆర్ సర్కారు ఇప్పటి వరకు బుల్డోజ్ చేసుకుంటూ వచ్చింది. ఈ ఆరోపణలను అయితే బుల్డోజ్ చేసింది కానీ...ఇప్పుడు ప్రాజెక్ట్ లో వెలుగు చూస్తున్న డొల్లతనాన్ని మాత్రం బయటకు రాకుండా అడ్డుకోలేకపోతోంది. దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం పెట్టి కట్టిన ఈ ప్రాజెక్టు లో వరసగా వెల్లడవుతున్న వాస్తవాలను కూడా ప్రభుత్వ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. సాగునీటి శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం కెసిఆర్ బహిరంగ సభల్లో అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కానీ...తాను రీ డిజైన్ చేసి అద్భుతంగా కట్టించానని చెప్పుకున్న కాళేశ్వరంలో బయటపడుతున్న డొల్లతనంపై మాత్రం నోరు విప్పటం లేదు. మంత్రి కేటీఆర్ అక్కడక్కడ దీనిపై స్పందించినా కూడా అదేమీ పెద్ద విషయం కాదు అన్నట్లు...ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నిర్మాణ సంస్థే ఖర్చు భరించి పనులు చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ ఐదేళ్లు కూడా పూర్తి కాకముందే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నదానికి సమాధానం దొరకదు. కొద్దిరోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం అయిన మేడిగడ్డ ప్రాజెక్ట్ కు సంబంధించి పిల్లర్లు కుంగటం, బ్యారేజ్ దగ్గర పగుళ్లు వెలుగు చూశాయి. ఈ విషయం వెలుగులోకి వచ్చి వారం కూడా గడవక ముందే మళ్ళీ ఇప్పుడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం అయిన అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద లీకేజీలు కలకలం రేపుతున్నాయి.

ఈ బ్యారేజీలో 38 నుంచి 40 పిల్లర్ల మధ్య ప్రాజెక్టు‌కు బుంగ ఏర్పడినట్లు బయటకు వచ్చిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. బుడగలు వచ్చే ప్రదేశంలో ఇసుక, మెటల్ నింపిన సంచులను వేస్తున్నారు. అదే సమయంలో ఒక గేట్ ఎత్తి నీటిని కిందకు వదిలేస్తున్నారు. ఇది అధికార పార్టీ నేతలను ఎక్కువగా కలవరానికి గురి చేస్తున్నాయి. అవినీతి ఆరోపణలను ఇంత కాలం ఎలాగోలా తోసిపుచ్చుతూ వచ్చినా కూడా ఇప్పుడు వరసపెట్టి బయటపడుతున్న లోపాలు మాత్రం ప్రభుత్వం పరువు తీసేవే అని...ప్రజల్లోకి ఇవి బలంగా వెళితే మాత్రం ఎన్నికల్లో తమ కొంప మునగడం ఖాయం అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఎవరికైనా నడిచినంత కాలం అలాగే ఉంటుంది అని...కానీ ప్రకృతి తలచుకుంటే ఎవరి ప్రమేయం లేకుండానే పాపాలు, లోపాలు అన్ని ఒకేసారి బయటకు అలా వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాం కానీ...ఇంత దారుణంగా.. ఎవరి మాటలను పట్టించుకోకుండా.. నిరంకుశంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని చూడలేదు అని కొంత మంది ఐఏఎస్ అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా గత రెండు రోజులుగా సీఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్లి పరిస్థితి చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడో కట్టిన ప్రాజెక్ట్ లు నేటికి చెక్కు చెదరకుండా ఉంటే.. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడే కుంగటం, కదలటంతో ఇక్కడ ఎంత దోపిడీ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అతి పెద్ద ఇష్యూగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగే నవంబర్ 30 లోపు ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it