Telugu Gateway
Telangana

హైద‌రాబాద్-కాన్పూర్ విమాన స‌ర్వీసులు ప్రారంభం

హైద‌రాబాద్-కాన్పూర్ విమాన స‌ర్వీసులు ప్రారంభం
X

జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి కాన్పూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇండిగో ఎయిర్ లైన్స్ ఈ స‌ర్వీసుల‌కు శ్రీకారం చుట్టింది. వారానికి 6 రోజులు హైదరాబాద్-కాన్పూర్ మధ్య విమాన సర్వీసులు న‌డ‌వ‌నున్నాయి. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, దేశంలో వ్యాక్సినేష‌న్ కూడా వంద కోట్ల డోసుల‌ను పూర్తి చేసుకోవ‌టంతో విమాన ప్ర‌యాణికుల సంఖ్య పెరుగుతోంది. అక్టోబ‌ర్ 17న జీఎంఆర్ శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి దేశీయ‌, అంత‌ర్జాతీయ ప్ర‌యాణికులు క‌లుపుకుని 50 వేల మంది ప్ర‌యాణించారు. ఇది కరోనా ముందు నాటి పరిస్థితుల‌తో పోలిస్తే 81 శాతం కింద లెక్క‌. "ది లెదర్ సిటీ ఆఫ్ ది వరల్డ్" అయిన కాన్పూర్‌కు నూతన విమాన సర్వీసులు ప్రారంభం అవటం ప‌లు వ‌ర్గాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌నుంద‌ని జీఎంఆర్ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇండిగో ఫ్లైట్ 6E 269 ప్రతిరోజూ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరుతుంది.

తిరిగి కాన్పూర్ నుండి ఇండిగో ఫ్లైట్ 6E 102 సాయంత్రం 4.35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్- కాన్పూర్ మధ్య వారానికి ఆరు సార్లు సోమవారం నుండి శనివారం వరకు – విమాన సర్వీసు ఉంటుంది. "కోవిడ్ తర్వాత హైదరాబాద్ నుండి కొత్త గమ్యస్థానాలకు డిమాండ్ పెరుగుతుండగా, నిరంతరం ఆ డిమాండ్‌ తీర్చడానికి ప్రయత్నిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న టైర్-2 నగరాలను అనుసంధానించడంపై మేం దృష్టిని కేంద్రీకరించాం. క్రమంగా పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్య, పలు సర్వీసుల పునఃప్రారంభం భారతీయ విమానయాన పరిశ్రమ తిరిగి పుంజుకుంటోందని సూచిస్తున్నాయి. విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ద్వారా విమాన ప్రయాణంపై ప్రయాణీకుల విశ్వాసాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాం.'' అని జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్ర‌దీప్ ఫ‌ణిక‌ర్ తెలిపారు.

Next Story
Share it