దేశం చేసిన ఒకే తప్పు..మోడీని గెలిపించటమే
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ కేంద్రంపై...ప్రధాని నరేంద్రమోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నమో అంటే నరేంద్రమోడీ కాదు. నమ్మిమోసపోవటం అన్నారు కెటీఆర్ శుక్రవారం నాడు సిరిసిల్లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జీవితాలు మార్చాలని ప్రజలు నరేంద్రమోడీకి అధికారం ఇస్తే చివరకు ఆయన జీవిత భీమా సంస్థను కూడా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ రేషన్, వన్ రిజిస్ట్రేషన్ అంటున్నారు. దేశంలో ఒకే ఒక తప్పు జరిగింది. అది 2014లో నరేంద్రమోడీని గెలిపించటమే అని వ్యాఖ్యానించారు.
నమోను నమ్మి ఎనిమిది సంవత్సరాలు దేశ ప్రజలు మోసపోయారన్నారు. సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వాలని ఎనిమిదేళ్ల నుంచి అడుగుతున్నా ఇంత వరకూ కేంద్రం ఏమీ ఇవ్వలేదన్నారు.తెలంగాణ పుట్టుకను అవహేళన చేసేలా మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ తీరుపై మండిపడ్డారు. అలాంటి బిజెపికి తెలంగాణలో ఉనికి ఉండాల్సిన ఉందా అని ప్రశ్నించారు. ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు వంచించారన్నారు. విదేశాల నుంచి నల్లధనం వెనక్కి రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో నిధులు వేస్తామన్నారు..ఇప్పటివరకూ వేశారా అని నిలదీశారు. ప్రగతి పథంలో పయనిస్తున్న తెలంగాణను ఆదుకోవాల్సింది పోయి పలు అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు.