తెలంగాణలోనూ ఏపీ సీన్
బిల్లులు ఇస్తేనే పనులు చేస్తామంటున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు
ముఖ్యమంత్రి కెసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రం అని పదే పదే చెబుతున్నారు. ఎవరైనా ధనిక రాష్ట్రంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ చెప్పేదానికి వాస్తవానికి తేడా ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి. ఇప్పుడు జరుగుతోంది అదే. ఓ వైపు ఆర్టీసీ ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో 1500 నుంచి 2000 కోట్లతో దళిత బంధు అమలు చేస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు చెల్తిస్తే తప్ప తాము పనులు చేయలేమంటూ ప్రకటించారు. ఈ మేరకు వాళ్లు తమ నిర్ణయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కు తెలియజేశారు. గత ఏడు నెలలుగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు కమిషనర్ ను కోరారు. ఫిబ్రవరి వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లిస్తామని కమిషనర్ లోకేష్ కుమార్ హామీ ఇచ్చారు. అయితే మార్చి వరకు బిల్లులు చెల్లించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను కోరారు.
మార్చి వరకూ బిల్లులకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో తక్షణమే చేస్తున్న పనులను నిలిపివేయాలని కాంట్రాక్టర్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా జీహెచ్ఎంసీలో కొత్తగా వచ్చే టెండర్లను కాంట్రాక్టర్లు చేపట్టవద్దని జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ల అసోసియేషన్ తీర్మానం చేసిందిని . గత కొంత కాలంగా ఏపీలోని అండ్ బి శాఖలో కూడా ఇదే పరిస్థితి ఉంది. పాత బిల్లులు చెల్లించకపోవటం ఒకెత్తు అయితే...భవిష్యత్ లో బిల్లులు చెల్లించే పరిస్థితి ఉంటుందో లేదో అన్న అనుమానంతో పనులు చేయటానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావటంలేదు. అందుకే బిల్లుల చెల్లింపునకు బ్యాంకులతో లింక్ పెడతామని మరీ హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. పలు శాఖల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.