కెసిఆర్, కెటిఆర్ చెప్పేది ఒకటి...చేసేది మరొకటి!
ఇందులో ఒక బిట్ ఎకరం వంద కోట్ల రూపాయలపైనా ధర పలికిన విషయం తెలిసిందే. గతంలో ఒక సారి వేలం వేసి ఇదే కోకాపేట భూముల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు సమీకరించారు. ఈ డబ్బులను దళిత బందుకు ఉపయోగిస్తామని ప్రభుత్వం అప్పటిలో ఘనంగా ప్రకటించుకుంది కూడా. కొద్ది రోజుల క్రితం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్ )ను దీర్ఘకాలిక ప్రాతిపదికన లీజుకు ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ ఖజానాకు 7380 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఓఆర్ఆర్ డబ్బులతో పాటు తాజాగా కోకాపేట, బుద్వేల్, మోకిలా భూముల వేలం ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం కలిపితే 14426 కోట్ల రూపాయలు అవుతున్నాయి. రాబోయే రోజుల్లోనే మరిన్ని భూముల వేలాలు కొనసాగే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఒక వైపు తాము ప్రవేటీకరణకు వ్యతిరేకం అంటూ ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చిపెట్టే ఓఆర్ఆర్ ను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు. తాము ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకం..ప్రధాని మోడీ అన్ని అమ్మేస్తున్నారు అని విమర్శించి ఎన్నికల ముందు ఎడా పెడా ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ రాజకీయ ప్రయోజనం పొందేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు అనే విమర్శలు బిఆర్ఎస్ సర్కారు ఎదుర్కొంటోంది.