Telugu Gateway
Telangana

కెసిఆర్ ఒకరు పిలిస్తే సీటు మారతారా?!

కెసిఆర్ ఒకరు పిలిస్తే సీటు మారతారా?!
X

తొమ్మిదేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను చూసిన వారు ఎవరైనా ఈ మాటలు నమ్ముతారా...అసలు అది సాధ్యం అవుతుందా? ఒక ఎమ్మెల్యే మూడు సార్లు అడిగారు అని కెసిఆర్ గత రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ నియోజకవర్గం కాకుండా కామారెడ్డి నియోజకవర్గంలో పోటీచేస్తారా?. కెసిఆర్ తీరు గురించి తెలిసిన వారు అయితే ఈ మాటలు ఖచ్చితంగా నమ్మరు అనే చెప్పొచ్చు. గత కొంత కాలంగా మీడియా లో ఈ సారి కెసిఆర్ సీటు మారతారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పలు మార్లు బహిరంగంగానే తాను చెపుతున్నట్లు తొమ్మిదేళ్లలో మెరుగైన, అద్భుతమైన పాలన అందించినట్లు భావిస్తే కెసిఆర్ తిరిగి గజ్వేల్ లోనే పోటీచేయాలి...సిట్టింగులు అందరికి సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కామారెడ్డి బిఆర్ ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తాజగా అసెంబ్లీ లాబీల్లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంప గోవర్ధన్ ఈ సారి కామారెడ్డి నుంచి సీఎం కెసిఆర్ పోటీచేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. తాను మూడు సార్లు సీఎం కెసిఆర్ ను ఆహ్వానించానన్నారు. కెసిఆర్ పూర్వీకుల గ్రామం ఒకటి ఒకటి కామారెడ్డి లో ఉంది అని గోవర్ధన్ వెల్లడించారు. చూస్తుంటే కెసిఆర్ సీటు మారేందుకు..ఈ విషయాన్నీ ప్రజల్లోకి పంపటానికి గోవర్ధన్ ఈ మాటలు చెప్పినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

సీఎం కెసిఆర్ ఆమోదం లేకుండా అయన సీటు గురించి బిఆర్ఎస్ లో ఒక ఎమ్మెల్యే మాట్లాడటం అన్నది జరిగే పని కాదు అన్న విషయం తెలిసిందే. ఇదేదో గ్రౌండ్ ప్రిపరేషన్ లాగా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కెసిఆర్ సీటు మారితే ఖచ్చితంగా రాజకీయ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి...కెసిఆర్ పూర్వీకుల ఊరు పోసానిపేట ఇక్కడే ఉంది అని గంప గోవర్ధన్ చెప్పినట్లు కనిపిస్తోంది. నిజంగా గంప గోవర్ధన్ చెప్పినట్లు సీఎం కెసిఆర్ సీటు మారితే మాత్రం అది బిఆర్ఎస్ పెద్ద మైనస్ అవుతుంది అని...ఓటమి భయంతోనే ఏకంగా సీఎం కెసిఆర్ సీటు మారితే ఇక రాష్ట్రంలో ఆ పార్టీ గెలుపు ఎలా సాధ్యం అవుతుంది అనే చర్చ స్టార్ట్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయనే చెప్పొచ్చు. గంప గోవర్ధన్ చెప్పినట్లు సీఎం కెసిఆర్ సీటు మారితే వచ్చే ఎన్నికల్లో ఇది ఒక కీలకం అంశంగా మారటం ఖాయం.

Next Story
Share it