Telugu Gateway
Telangana

జ‌గ‌దీష్ రెడ్డి బాహుబ‌లి అయితే..మ‌రి కెసీఆర్?!

జ‌గ‌దీష్ రెడ్డి బాహుబ‌లి అయితే..మ‌రి కెసీఆర్?!
X

తెలంగాణ లో కొంత మంది క‌లెక్ట‌ర్లు సీఎం కాళ్ళు మొక్క‌టం..మోకాళ్ల మీద కూర్చుని నాయ‌కుల‌తో మాట్లాడ‌టం గ‌త కొంత కాలంగా చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఎస్పీ అయితే ఏకంగా మంత్రిని జ‌య‌హో ..జ‌య‌హో అంటూ కీర్తించారు. ఆయ‌నే సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర‌ప్ర‌సాద్. ఇప్ప‌టి వ‌ర‌కూ కొంత మంది క‌లెక్ట‌ర్లు ఇలాంటి ప‌నులు చేస్తే ఇప్పుడు ఓ ఎస్పీ ఏకంగా మంత్రికి జిందాబాద్ లు కొట్టించారు. అక్క‌డితో ఆగ‌కుండా జ‌గ‌దీష్ రెడ్డి మంత్రిగా ఉండ‌టంఅదృష్టం అంటూ ప్ర‌క‌టించారు. అంతే కాదు..మంత్రి జ‌గ‌దీష్ రెడ్డిని ఆయ‌న ఏకంగా బాహుబ‌లితో పోల్చారు.

మ‌రి మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి బాహుబలి అయితే సీఎం కెసీఆర్ ఏమ‌వుతారు. బాహుబ‌లే అత్యంత బ‌లాడ్యుడు క‌దా. ఓ మంత్రే బాహుబ‌లి అయితే ఎంతో మంది మంత్రుల‌ను నియ‌మించిన కెసీఆర్ ఏమి అవుతారో అంటూ టీఆర్ఎస్ నేత‌లు..అధికారులు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రిని ఓ బ‌హిరంగ వేదిక‌లో ఎస్పీ జ‌య‌హో..జ‌య‌హో అంటూ కీర్తించ‌టం..బాహ‌బ‌లిగా వ‌ర్ణించ‌టం రాజ‌కీయ వ‌ర్గాల‌తోపాటు అధికారుల‌నుకూడా షాక్ కు గురిచేసింది. చాలా చోట్ల పోలీసు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ కాంగ్రెస్, బిజెపిలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ త‌రుణంలో ఎస్పీ వ్యాఖ్యలు రాజ‌కీయంగా మ‌రింత దుమారం రేపుతున్నాయి.

Next Story
Share it