Telugu Gateway
Telangana

అదే జరిగితే బిఆర్ఎస్ కు బిగ్ షాకే!

అదే జరిగితే బిఆర్ఎస్ కు బిగ్ షాకే!
X

అదే జరిగితే నిజంగా బిఆర్ఎస్ బిగ్ షాకే అని చెప్పొచ్చు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. బిఆర్ఎస్ చేయించుకున్న అంతర్గత సర్వేల్లో కెసిఆర్ అక్కడ పోటీ చేస్తే కష్టమే అని రిపోర్ట్ వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా బిఆర్ఎస్ కు దమ్ము ఉంటే ..తాము తొమ్మిదేళ్లలో ఎంతో చేశాం అనుకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం కెసిఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేయాలి..సిట్టింగ్ లు అందరికి సీట్లు ఇవ్వాలి అంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వాస్తవానికి గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న 119 నియోజక వర్గాల్లో అత్యధిక నిధులు...అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన నియోజక వర్గాలు ఏమైనా ఉంటే సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, కెసిఆర్ తనయుడు మంత్రి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, మరో మంత్రి హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటలు మాత్రమే ముందు వరుసలో ఉంటాయి. ఒక వైపు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ, వజ్రపు తునక తెలంగాణ చేశానని చెప్పుకుంటున్న సీఎం కెసిఆర్ ప్రచారం జరుగుతున్నట్లు నియోజకవర్గం మారితే మాత్రం అది పార్టీ కు పెద్ద మైనస్ గా మారటం ఖాయం అనే చర్చ బిఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. దేశానికే ఇప్పుడు తెలంగాణ మోడల్ ఆదర్శం అని చెప్పుకునే కెసిఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాకుండా మరో చోటికి మారితే ఓటమి భయంతోనే అయన నియోజకవర్గం మారినట్లు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి.

ఇప్పటికే పలు అంశాల్లో బిఆర్ఎస్ ప్రజల్లో వ్యతిరేకత చవిచూస్తోంది. వీటికి తోడు ఎక్కడా పెట్టనంత నిధులు ఖర్చు పెట్టి కూడా కెసిఆర్ నియోజకవర్గం మారితే అది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది అనే భయం పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సీఎం కెసిఆర్ ఎమ్మెల్యే ల వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే కొద్ది నెలల క్రితం వరకూ సిట్టింగ్ లు అందరికీ సీట్లు అని చెప్పి ..ఇప్పుడు సర్వేల ఆధారంగానే టికెట్ లు అనే అంశాన్ని ప్రచారంలోకి పెట్టారు. సీఎం కెసిఆర్ కూడా నిజంగానే ప్రచారంలో ఉన్నట్లు గజ్వేల్ కాకుండా మరో నియోజక వర్గానికి వెళ్లినా కూడా అప్పుడు కూడా ఇదే లాజిక్ అంటే ..కెసిఆర్ కు వాతావరణం గజ్వేల్ లో బాగాలేదు కాబట్టే మారారు అనే వాదన కూడా తెరపైకి రావటం ఖాయం. రాష్ట్రానికి...నియోజకవర్గానికి ఎంతో చేసిన...చేశానని చెప్పుకుంటున్న కెసిఆర్ కే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అనుకూల వాతావరణం లేకపోతే ఇక ఇతర మంత్రులు, ఎమ్మెల్యే ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో కెసిఆర్ సీటు మార్పు అంతా ఆషామాషీ వ్యవరం ఏమి కాదు. అలా కాకుండా నిజంగా మారితే మాత్రం ప్రతిపక్షాలకు ఒక పెద్ద అస్త్రం ఇచ్చినట్లే చెప్పుకోవచ్చు. చూడాలి మరి అంతిమంగా ఏమి జరుగుతుందో.

Next Story
Share it