ఆస్తులపై సుప్రీం కోర్ట్ జడ్జి తో విచారణకు సిద్ధమా

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కేటీఆర్ ఫ్యామిలీకి చెందిన స్టార్ హోటల్స్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణం సిరిసిల్ల మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించటమే. అందరూ కలిసి ఉండటానికి హైదరాబాద్ లో ఉండటానికి తమ కుటుంబానికి ఒక మంచి ఇల్లు కూడా లేదు అని ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మంచి ఇల్లు లేదు అని చెపుతున్న కేటీఆర్ ఫ్యామిలీకి వందల కోట్ల రూపాయల విలువ చేసే స్టార్ హోటల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి అని రేవంత్ రెడ్డి తాజాగా ప్రశ్నించారు. ప్రజల ఓట్లను నోట్లుగా మార్చుకుని రాష్ట్రాన్ని దోచుకున్నారు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై మాజీ మంత్రి గురువారం నాడు కేటీఆర్ స్పందించారు. ఆయన తెలంగాణ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ హోటల్స్ అంశంపై స్పష్టత ఇచ్చారు. అమెరికాలో కష్టపడి సంపాదించుకున్న పైసలతోనే తాను 2006లో ఒక హోటల్ పెట్టాను అన్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నారు అని...2006లో ఒక హోటల్ పెడితే అది 20 ఏళ్లకు మూడు హోటళ్లు అయింది అని చెప్పారు.
వాటిని తాను సరిగా పట్టించుకుని ఉంటే, వాటిని పది హోటళ్లుగా చేసే వాడిని. 2009లో నేను పోటీచేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో ఆ విషయం చెప్పాను. నిన్న రేవంత్ రెడ్డి మొత్తుకున్నదంతా.. నేను అఫిడవిట్ లో పెట్టిన విషయమే..నేను అఫిడవిట్ లో చెప్పిన విషయాన్ని… మళ్లీ ఏదో కొలంబస్ కనుగున్నట్టు చెబుతున్నడు. వ్యాపారం చేసుకోవడం తప్పా..నా భార్యా పిల్లలకు కూడా బువ్వ పెట్టాలె కదా నేను. లేకపోతే రాజకీయంలో ఏం చేస్తున్నవు అని అడుగుతారు. నిన్న ఫ్రీగా నా హోటళ్లకు రేవంత్ పబ్లిసిటీ ఇచ్చినందుకు సంతోషం. రేవంత్ రెడ్డి నీ లాగా మందిమీద పడి దోచుకోలేదు. నువ్వు గోడలకు పేయింటర్ వి. నువ్వు చదువుకోలే.. నేను చదువుకున్న. అందరూ డిగ్రీ మూడేళ్లు చదువుతరు. రేవంత్ రెడ్డి ఎనిమిది ఏళ్లు డిగ్రీ చదివిండు. మా నాయన ఎప్పుడూ మాకు బాగా చదువుకోండి అని చెప్పేవారు.
మంచిగా చదువుకుని అమెరికాలో ఆరు ఏళ్లు ఉద్యోగం చేశాను. నాలుగు పైసలు సంపాదించుకుని ఇండియాకు తిరిగి వచ్చాను. 2004 సెప్టెంబర్ లో ఉద్యోగం మీదనే తిరిగి వచ్చాను. 2006లో కేసీఆర్ రాజీనాామా చేస్తే నాటి బై ఎలక్షన్ సమయంలో వచ్చి పనిచేశాను. కరీంనగర్ లో ఆనాడు ఓడిపోతే తెలంగాణ ఉద్యమానికి ఇబ్బంది అని వచ్చాను. రేవంత్ రెడ్డి లెక్క ప్రజలమీద పడి దోచుకునే అలవాటు నాకు లేదు. ముఖ్యమంత్రి బురదజల్లుతడు.. మనం కడుక్కోవాలె అన్నట్టు ఉంది పరిస్థితి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హోటల్స్ అంశంపై వివరణ ఇవ్వటంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తమ కుటుంబ ఆస్తులతో పాటు రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి తో విచారణకు సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తూనే ఉంటామన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టులు పొంగులేటికి తప్ప బీసీలకు వస్తున్నయా..కాళేశ్వరం ప్రాజెక్టును కూడా పడావు పెట్టారు.. రైతుబీమా బంద్ పెట్టారు. రాహుల్ గాంధీ వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా.. రెండు ఉద్యోగాలు ఊడగొట్టండి అని అన్నారు. ఛాత్రోంకి గూంజ్ అని తిరుగుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నడు తప్ప ఇక్కడికి వచ్చే ధైర్యం లేదు. కాంగ్రెస్ వాళ్లను బట్టలు ఊడదీసి కొట్టే రోజు దగ్గర్లోనే ఉన్నది అంటూ హెచ్చరించారు.



