జీహెచ్ఎంసీలో 'ఐ ఫోన్ల పంచాయతీ'
ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి..పలితాలు కూడా వచ్చేశాయి. కానీ విచిత్ర పరిస్థితుల నేపథ్యంలో పాత కమిటీనే ఇంకా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికలు అయిపోయాక ఇలా చేయటం సబబా..కాదా అన్న సంగతి పక్కన పెడితే మరికొద్ది రోజుల్లోనే తప్పుకోనున్న స్టాండింగ్ కమిటీ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు తీవ్ర వివాదస్పదం అవుతోంది. అదేంటి అంటే ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ తోపాటు మొత్తం 16 మందికి కొత్త ఐ ఫోన్ 12 కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. దీని కోసం ఏకంగా 27 లక్షల వ్యయం చేయనున్నారు. ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది. స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ బహుమతిగా ఇవ్వాలని ప్రతిపాదించారు. అందులో కొంత మంది ఓటమి పాలైన వారు కూడా ఉన్నారని సమాచారం.
ఒక్కో మొబైల్ విలువ 1.6 లక్షలు. ఇంకో 45 రోజుల్లో ప్రస్తుత గ్రేటర్ పాలకమండలి గడువు ముగియనుంద. ఈ బహుమతుల కార్యక్రమంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందనడానికి తాజా బాగోతమే ఉదాహరణ అని బీజేపీ హైదరాబాద్ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న నగరపాలక సంస్థ ఇంత ఖర్చు చేసి ఐఫోన్లు బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని నీళ్లగా ఖర్చు చేస్తున్న జీహెచ్‌ఎంసీ పాలక మండలి సభ్యులు సిగ్గపడాలని విమర్శించారు. . ఫోన్ల కొనుగోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని మీడియాతో శుక్రవారం పేర్కొన్నారు.