సీఎం శాఖ పరిధిలోనే హైడ్రా

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక. హైడ్రా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ పరిధిలోనే పని చేస్తోంది. హైడ్రా పెట్టిన ఉద్దేశం ఎంతో మంచిది అయినా కూడా ఇది పక్కదారి పట్టిందనే విమర్శలు...ఆరోపణలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రా తన లక్ష్యాల విషయంలో సెలెక్టివ్ గా వ్యవహరిస్తోంది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ హై కోర్ట్ హైడ్రా తీరుపైనా...హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహరిస్తున్న పద్ధతిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా కూడా ముఖ్యమంత్రి....మున్సిపల్ శాఖ చూస్తున్న రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా హై కోర్ట్ ఎందుకింత సీరియస్ కామెంట్స్ చేసింది...హైడ్రా పని తీరులో ఏమైనా లోపాలు ఉన్నాయా...వీటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందా అన్న అంశంపై దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా విషయంలో తెలంగాణ హై కోర్ట్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపించేవే.
అది కూడా నేరుగా సీఎం చూసే శాఖకు చెందిన ఒక విభాగంపై ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా కూడా రేవంత్ రెడ్డి ఏ మాత్రం పట్టించుకోకపోవటం సరికాదు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జీవో ద్వారా ఏర్పాటు అయిన హైడ్రాకు ప్రభుత్వ శాఖలు అన్నీ మోకరిల్లాయి అంటూ కూడా హై కోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పదే పదే హై కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ హైడ్రా ముందుకు వెళ్లటంతో కోర్టు కూడా పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఏకంగా 63 కోర్టు ధిక్కార పిటీషన్స్ ఉన్నాయని...ఇలా ఎందుకు జరుగుతుంది అని కోర్టు ప్రశ్నించింది. లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి సోమవారం నాడు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాలంటూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హై కోర్టు ఒక అధికారి విషయంలో ఇంత సీరియస్ ఆదేశాలు జారీ చేయటం ఇదే మొదటి సారి అధికార వర్గాలు చెపుతున్నాయి. హైడ్రా కమిషనర్ పదే పదే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏ మాత్రం సమంజసం కాదని హై కోర్టు పేర్కొంది. రంగనాథ్ స్థానంలో మరో అధికారిని నియమించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు తెలిపారు. కోర్టులు, న్యాయ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే లోతుకుంట సర్వే నంబర్లు 1, 2 పరిధిలోని 40 ఎకరాల భూమిలోకి హైడ్రా బృందం వెళ్లలేదని కోర్టుకు వివరించారు. ఈ విషయంలో పిటిషనర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని రంగనాథ్ తన అఫిడవిట్‌లో ప్రస్తావించారు.



