బిఆర్ఎస్ నేతల ప్రచారంలో నిజం ఎంత!
అందరి మదిలో ఇప్పుడు ఇదే ప్రశ్న. సరిగ్గా వారం రోజుల్లో తెలంగాణాలో ఎవరి ప్రభుత్వం ఏర్పడబోతుందో తేలిపోనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంశం కూడా ఒక ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కీలక నేతలు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు కూడా. వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుంది అని. గత పదేళ్ల కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసాధారంగా పెరిగింది. ప్రభుత్వమే ఇందుకు కారణం అనే విమర్శలు కూడా ఉన్నాయి. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం వేసిన వేలంలో కూడా ..కొంత మందితో అస్మదీయ సంస్థలతో కుమ్మక్కు అయి రేట్లను కృత్రిమంగా పెంచినట్లు వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే మరో వైపు గత ఏడాదికి పైగా హైదరాబాద్ మార్కెట్ లో అమ్ముడు పోని అపార్ట్ మెంట్స్ (ఇన్వెంటరీ) లక్షకు పైనే ఉన్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఇంకా అదే పరిస్థితి ఉంది అని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. మరి బిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నట్లు ఒక వేళ తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుంది అనే వాదనలో హేతుబద్దత ఉందా? ...నిజంగానే అలా జరుగుతుందా అంటే ఆ అవకాశాలు ఏ మాత్రం లేవు అని ఈ రంగంలోని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి అనేది ఇప్పటికే టేక్ ఆఫ్ అయిన విమానం వంటిది అని...దాన్ని అలా వదిలేసినా కూడా ముందుకు సాగుతుంది తప్ప..దీనికి ఏ మాత్రం ఢోకా ఉండదు అని తేల్చిచెపుతున్నారు. దేశంలోని కీలక నగరాలకు గంటల్లో, విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన ఎయిర్ కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైల్ వంటి మౌలిక సదుపాయాలు నగరంలో ఉన్నందున ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెపుతున్నారు.
మరో కీలక విషయం ఏమిటి అంటే...దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ప్రీమియం అపార్ట్ మెంట్లు ...ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు కూడా అందుబాటు ధరల్లో ఉండటం ఒక కీలక అంశం. అయితే ఈ ఎన్నికల్లో ఒక వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక ఆరు నెలల పాటు దిద్దుబాటు..సర్దుబాటు మాత్రం తప్పదు అని..ఆ తర్వాత మాత్రం ఇప్పుడు ఉన్న తరహాలోనే మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుంది అని స్పష్టం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నట్లు ఒక వేళ బిఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకున్నా కూడా ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన అదనపు హామీలు..ఇతరత్రా కారణాల వల్ల కూడా రియల్ మార్కెట్ వెంటనే ఏమీ పరుగులు పెట్టే ఛాన్స్ ఉండదు అని చెపుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బిఆర్ఎస్ ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్ మాత్రమే. అలాంటిది అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా...బంగారు బాతు లాంటి హైదరాబాద్ నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ను ...లేదంటే మరో రంగాన్ని అయినా ఎందుకు దెబ్బతీసుకుంటుంది. నిజంగా ఎవరైనా అలా చేస్తారా?. చేస్తే అంత కంటే తెలివితక్కువ పని మరొకటి ఉండదు అని రియల్ ఎస్టేట్ రంగంలోని వర్గాలు చెపుతున్నాయి. ఉన్నంతలో ఎవరైనా యాక్టీవిటీని పెంచుకుంటూ అదనపు వనరుల కోసం ప్రయత్నం చేస్తారు తప్ప..ఉన్న అవకాశాలను ఎవరూ దెబ్బతీసుకోరు అనే విషయం తెలిసిందే. అంతే కానీ అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా ఆటో మోడ్ లో దూసుకెళుతున్న హైదరాబాద్ ను ఆపే ప్రయత్నం చేయదు అని...అదే సమయంలో హైదరాబాద్ డెవలప్ మెంట్ కు బ్రేకులు వేయటం ఇప్పటిలో ఎవరికీ సాధ్యం కాదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాత్కాలిక సర్దుబాటు తప్పదు అని...అంతే తప్ప హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు ఎలాంటి ఢోకా ఉండదు అని ఈ రంగంలోని నిపుణులు తేల్చి చేస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనం పొందేందుకే కొంత మంది ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు అని డెవలపర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.