హైదరాబాద్ లో 15 శాతం మేర తగ్గిన ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం సర్దుబాటు దిశగా సాగుతుందా?. అంటే ఔననే అని చెబుతున్నాయి లెక్కలు. 2022 తొలి మూడు నెలల్లో హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు 15 శాతం మేర తగ్గాయి. 2021 సంవత్సరం తొలి మూడు నెలల కాలంలో 7721 యూనిట్లు అమ్ముడుపోగా..2022 తొలి మూడు నెలల్లో 6,556 యూనిట్లు అమ్ముడు అయ్యాయి. ఈ సమయంలో ముంబయ్ లో అమ్మకాలు 26 శాతం మేర, బెంగుళూరులో మూడు శాతం మేర అమ్మకాలు పెరిగాయి. ఢిల్లీ, చెన్నయ్, కోల్ కతా వంటి నగరాల్లో హైదరాబాద్ తరహాలోనే అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఓ వైపు తొలి మూడు నెలల కాలంలో అమ్మకాలు తగ్గగా..సరఫరా మాత్రం భారీ పెరిగింది. 2021 తొలి మూడు నెలల కాలంలో 7,604 కొత్త యూనిట్లు అందుబాటులోకి రాగా, 2022 తొలి మూడు నెలల్లో ఈ సంఖ్య 14,572కు పెరిగింది. ప్రాప్ టైగర్. కామ్ ఈ వివరాలను వెల్లడించింది. దేశ ఐటి రాజధానిగా ఉన్న బెంగుళూరుతో పోలిస్తే హైదరాబాద్ లోనే అపార్ట్ మెంట్ రేట్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఎప్పటి నుంచో ఇదే ట్రెండ్ నడుస్తోంది. 2022 మార్చిలో హైదరాబాద్ లో చదరపు అడుగు ధరలు ఏడు శాతం పెరిగి 6000 నుంచి 6200 రూపాయలకు పెరిగాయి.
బెంగుళూరులో చదరపు అడుగు ధర ఆరు శాతం పెరుగుదలతో 5600 నుంచి 5800 రూపాయల వద్ద అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ధరతో ఇండియాలో 8 ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. ఇండియాలో 8 ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. 2022 ఏడాదికి మొదటి త్రైమాసికంలో హైదరాబాద్‌లో మొత్తం 14,572 ఇళ్లను నిర్మిస్తే అందులో అమ్ముడు పోయింది కేవలం 6,556 యూనిట్లేనని తెలిపింది. దీంతో చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన గృహాల (ఇన్వెంటరీ) సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య రోజురోజుకీ మరింత పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 73,651యూనిట్లుగా ఉండగా.. 25 నెలల కాలంలో ఈ ట్రెండ్ మరింతగా పెరిగినట్టు ప్రాప్ టైగర్ పేర్కొంది.