Telugu Gateway
Telangana

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో సంచలనం

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో  సంచలనం
X

తెలంగాణాలో...ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికవరీకి ఇది సంకేతమా?!. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. గత రెండేళ్లుగా...ముఖ్యంగా ఎన్నికల ముందు నుంచి కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ గా ఉన్న మాట వాస్తవమే. కొద్ది నెలల క్రితం తెలంగాణ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కూడా మార్కెట్ పై కొంత ప్రభావం చూపించింది. ఈ ప్రభావం కంటే ప్రతిపక్ష బిఆర్ఎస్ చేసిన ప్రచారం కూడా బాగానే పని చేసింది. కానీ సడన్ గా ఇప్పుడు హైదరాబాద్ లో రాయదుర్గం లో ఎకరం భూమి ధర 177 కోట్ల రూపాయలు పలకటం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు అందరిని ఆశ్చర్య పరిచింది అనే చెప్పాలి. రాయదుర్గం లోని నాలెడ్జి సిటీ లో ఎకరా 177 కోట్ల రూపాయల లెక్కన 7 . 6 ఎకరాల భూమిని మొత్తం 1357 కోట్ల రూపాయలకు ఎంఎస్ ఎన్ రియాల్టీ సంస్థ దక్కించుకుంది. గతంలో ఎప్పుడూ కూడా హైదరాబాద్ లో ఇంత భారీ ధర రాలేదు. బిఆర్ఎస్ హయాంలో కూడా కోకాపేటలోని నియోపోలిస్ లో అమ్మిన ఎకరా ధర 100 .75 కోట్ల రూపాయల కంటే ఇది ఎంతో ఎక్కువ

గతంలో హెచ్ ఎం డీఏ నిర్వహించిన వేలంలో ఈ ధర రాగా అప్పటిలో బిఆర్ఎస్ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. రాయదుర్గంలో భూమిని వేలం కోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పనా సంస్థ (టిజీఐఐసి ) పెట్టగా...దేశంలోని ప్రముఖ సంస్థలతో పాటు రాష్ట్రానికి చెందిన కంపెనీలు కూడా ఎంతో ఆసక్తి చూపించినట్లు టిజీఐఐసి ఒక ప్రకటనలో తెలిపింది. రాయదుర్గంలో ఎకరాకు 177 కోట్ల రూపాయల ధర పలకటం హైదరాబాద్ మార్కెట్ పై పెట్టుబడిదారులు..డెవలపర్లకు ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తుంది అని టిజీఐఐసి ఒక ప్రకటనలో వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు దీన్ని కచ్చితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవటం ఖాయం అనే చెప్పొచ్చు. టిజీఐఐసి భూముల వేలంతో పాటు హౌజింగ్ బోర్డు భూముల వేలంలోనూ కొన్ని చోట్ల మంచి ధరలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. చింతల్ లో గజం ధర 1 . 14 లక్షలు పలికింది. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గాడిన పడుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఇది ఎంపిక చేసిన ప్రాంతాలకే పరిమితం అవుతుందా..లేక అంతటా ఇదే ట్రెండ్ వస్తుందా అన్నది కొన్ని నెలలు పోతే కానీ తెలియదు.

Next Story
Share it