Telugu Gateway
Telangana

అనధికారిక కమిటీ ఇష్టారాజ్యం!

అనధికారిక కమిటీ ఇష్టారాజ్యం!
X

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పాలక వర్గం పదవి కాలం ముగిసి నెలలు గడుస్తున్నా కూడా ఎన్నికల తేదీ ప్రకటించటం లేదు. ఇది ఒక వ్యవహహారం అయితే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేణు గోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శి రవి కాంత్ రెడ్డి ఈ క్లబ్ ఏదో తమ ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్లు వ్యవరిస్తున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ లకు సన్మానం చేశారు. వీళ్ళతో పాటు జర్నలిస్ట్ లుగా ఉండి..ఇటీవల తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా నియమితులు అయిన అయోధ్య రెడ్డి, పీవి శ్రీనివాస రావు లకు కూడా సన్మానం చేశారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస రెడ్డి ని నియమించింది గత ఏడాది ఫిబ్రవరిలో.

ఇప్పటి వరకు ఆగి ఇప్పుడు ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ తో కలిసి సన్మానం చేయటం ఏమిటి?. ఈ కార్యక్రమం మొత్తం చేసింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ తరపున. కానీ క్లబ్ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వకుండా పాలకవర్గంలో ఉన్న ప్రెసిడెంట్ వేణుగోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శి రవి కాంత్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు దుమారం రేపుతోంది. క్లబ్ సభ్యులుగా ఉన్న వాళ్లకు కీలక పదవులు వస్తే వాళ్ళను గౌరవిస్తూ సన్మానం చేయటాన్ని ఎవరూ తప్పు పట్టారు. కానీ సభ్యులకు ఈ విషయంలో కనీస సమాచారం ఇవ్వకుండా ప్రెస్ క్లబ్ మొత్తం తమ ప్రైవేట్ వ్యవహారం అన్నట్లు చేయటం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పాలకవర్గానికి ఏ మాత్రం ఇలాంటి కార్యక్రమాలు అధికారికంగా చేయటానికే అర్హత లేదు. అయినా కూడా ఇప్పుడు సెలెక్టెడ్ గా కొంత మందిని పిలిచి..ఈ మొత్తం వ్యవహారాన్ని అదేదో తమ ప్రైవేట్ ఫంక్షన్ గా చేయటంపై సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

Next Story
Share it