హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు

లాక్ డౌన్ సడలింపులకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో వేళల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారం నుంచి తెలంగాణాలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెట్రో సర్వీసులను కూడా పొడిగించారు. దీని ప్రకారం ఉదయం ఏడు గంటలకు మొదటి మెట్రో సర్వీస్ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు చివరి మెట్రో సర్వీస్ బయలుదేరుతుంది.
సాయంత్రం ఆరు గంటలకల్లా డిపోలకు మెట్రో రైళ్లు చేరుకోనున్నాయి. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు బుధవారం వరకు వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు రాత్రివేళల్లో లాక్ డౌన్ అమలు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం హైదరాబాద్ మెట్రోపై బాగానే పడింది. కరోనాకు ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది.